తొలి తెలుగు వాగ్గేయ కారుడు, పద కవితా పితామహుడు అన్నమయ్య 601 జయంత్యుత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా, సోమవారం రాత్రి శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.అన్నమాచార్యుల స్వగ్రామం తాళ్లపాకలో జరిగిన ఈ శ్రీనివాస కళ్యాణోత్సవానికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వేలాది మంది భక్తుల ఎదుట అన్నమయ్య విగ్రహ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. వైష్ణవ సంప్రదాయ ప్రకారం ఆగమ పండితులు శ్రీనివాస కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవీ, భూదేవీలతో సర్వాలంకరణా భూషితుడైన శ్రీవారు, పెళ్లి శోభతో భక్తులకు దర్శనమిచ్చారు. శాస్తోక్తంగా నిర్వహించిన శ్రీదేవీ, భూదేవీల మాంగల్యధారణ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో తాళ్లపాక అన్నమయ్య విగ్రహ ప్రాంగణం నిండిపోయింది.ఇదిలా ఉండగా.. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకను తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుందని టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ప్రకటించారు. తాళ్లపాకను దత్తత తీసుకుని, ఆ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తితిదే సన్నాహాలు చేస్తుందని ఆదికేశవులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన లక్ష గళ సంకీర్తనార్చన, గిన్నిస్ బుక్ రికార్డుకెక్కడం పట్ల ఆదికేశవులు హర్షం వ్యక్తం చేశారు. |