తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే చారిత్రక గోల్కొండ బోనాల ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా.. తొలి రోజైన 25వ తేదీ శ్రీ జగదాంబికా దేవాలయం మొదటి పూజతో ఉత్సవాలు ఆరంభమై, జూలై 23వ తేదీ తొమ్మిదవ పూజతో ముగుస్తాయి. ఈ బోనాల ఉత్సవాలకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కును తీర్చుకుంటారు. కోరిన భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే ఈ అమ్మవారిని జంటనగరాలతో పాటు తెలంగాణ జిల్లాల ప్రజలు ఆరాధ్యదైవంగా పూజిస్తున్నారు.ఇకపోతే.. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని దేవాదాయ శాఖ భద్రతను పటిష్టం చేస్తోంది. మరోవైపు... రకరకాల వస్తువులను అమ్మే దుకాణాలు గోల్కొండ వీధుల్లో సందడి చేస్తున్నాయి. ఈ బోనాల ఉత్సవాల్లో తెలంగాణ ప్రజలే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారని శ్రీ జగదాంభికా దేవాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. |