భవిష్యత్తులో ఉగ్రవాద, అసాంఘిక శక్తుల నీడ తిరుమల-తిరుపతిపై పడకుండా ఉండే దిశగా తిరుపతి భద్రతపై మరో వారంలో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కానుంది. తిరుమలపై పటిష్టమైన నిఘా ఏర్పాటుకు సంబంధించిన వివరాలపై ఈ సమావేశంలో ఉన్నత అధికారులు అధ్యయనం చేస్తారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి, డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్, ఇంటలిజెన్స్ డీజీ అరవిందరావులతో పాటు తదితర ఉన్నత అధికారులు పాల్గొంటారు.తిరుమలేశుని దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో, తిరుమల వెంకన్న ఆలయ భద్రత కోసం అధికమొత్తాన్ని వెచ్చించేందుకు ముఖ్యమంత్రి సుముఖత తెలిపినట్లు సమాచారం. రాజధాని నగరంలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు అనంతరం విడిగా నిర్వహించిన జిల్లా సమీక్షలో తిరుమల భద్రత చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ భద్రతకు తగిన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. ఉన్నత స్థాయి అధికారులు సమావేశమై భద్రతపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూచిస్తే ఆ మేరకు అమలు చేస్తామని సీఎం తెలిపారు.దీంతో తిరుమలేశుని ఆలయానికి నాలుగు కిలోమీటర్ల చుట్టూ అటవీ ప్రాంతంలో ప్రహరీ నిర్మించడం, ప్రహరీపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వంటి మరికొన్ని సూచనలను ఎస్పీ లక్ష్మీరెడ్డి ప్రభుత్వం ముందుంచారు. ఎస్పీ ముందుంచిన అనేక సూచనలపై ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు చర్చిస్తారు. |