కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీ వెంకటేశ్వ స్వామికి కానుకలు వెల్లువల్లా వస్తున్నాయి. తాజాగా శ్రీవారికి ఇద్దరు భక్తులు కిలో బంగారం, రూ.50లక్షల నగదును సోమవారం విరాళంగా సమర్పించారు.
బెంగళూరు నగరవాసి శ్రీనివాసమూర్తి బంగారాన్ని టీటీడీ ఛైర్మన్ డి.కె. ఆదికేశవులుకు అందజేశారు. దీనిని "అనంత స్వర్ణమయం" పథకానికి వినియోగించాలని కోరారు. అలాగే ఓ అజ్ఞాత భక్తుడు స్వామివారికి రూ. 50లక్షల నగదును సమర్పించారు.
ఇదిలా ఉంటే.. తిరుమలలో ఈ నెల 19వ తేదీ (బుధవారం) నుంచి కరిరిష్టి యాగం ప్రారంభం కానుంది. ఐదురోజుల పాటు జరిగే ఈ యాగం తీవ్ర కరువుతో అల్లాడుతోన్న రాష్ట్ర ప్రజల కోసం నిర్వహిస్తున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో తీవ్ర కరువు వెతలు తీర్చాలనే సంకల్పంతో టీటీడీ ఈ యాగ నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
తిరుమల కొండపై పార్వేట మండపం వద్ద బుధవారం నుంచి వేద పండితులు, ఋత్వికులు, అర్చకులు ఈ యాగ నిర్వహణలో పాల్గొంటారని టీటీడీ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఈ యాగంలో తితిదే అధికారులతో పాటు భక్తులు భారీ ఎత్తున పాల్గొనే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది.