చారిత్రాత్మక కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు కేదార్‌నాథుణ్ణి దర్శించుకుందామనుకున్నారు.
అయితే వృషభాకారంలో ఉన్న స్వామి తలమొండెం నుంచి వేరైందని పురాణగాథ చెబుతోంది. ఇందుకు తగ్గట్లుగా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథుణ్ణి ఒక వృషభ మొండెంగానే పూజిస్తారు.
ఈ నేపథ్యంలో మహాభారత కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒక అవశేషం భారత్‌లోని కేదార్‌నాథ్ ఆలయానికి నేపాల్‌కు గల సంబంధాలను సూచిస్తోంది. ఈ విషయాన్ని భారత్‌లోని కేదార్‌నాథ్ పీఠ్‌కు చెందిన జగద్గురు భీమశంకర్ లింగశివాచార్య మహాస్వామీజీ చెప్పారు. కేదార్ నాథీశ్వరుడి తల ఖాట్మండు భక్తాపూర్‌లోని దోలేశ్వర్ ఆలయంలో కనిపించిందని అన్నారు.
భారత్‌లో ఉన్న కేదార్ పీఠ్‌లో కేదారేశ్వరుడి శరీరం మాత్రమే ఉందని లింగశివాచార్య తెలియజేశారు. దాదాపు 3,500 ఏళ్లుగా కేదార్‌నాథుడి తలకోసం భక్తులు వెదుకుతున్నారు.
స్వామి పాండవులకు దర్శనమివ్వకుండా ఉండడానికి వృషభరూపం ధరించారని స్వామీజీ చెప్పారు. కేదార్ పీఠ్, దోలేశ్వర్‌లు సుమారు 3వేల ఏళ్ల పురాతనమైనవని, వీటి మధ్య ఎన్నో సారూప్యాలు ఉన్నాయని స్వామీజీ వివరించారు.