తిరుపతి హథీరాంజీ మఠానికి చెందిన విలువైన నగలు భద్రంగానే ఉన్నాయని ఆ మఠం మాజీ మహంతు దేవేంద్ర దాస్‌జీ స్పష్టం చేశారు. 1964 నుంచి ఆ నగలు బ్యాంక్ లాకర్లోనే ఉన్నాయని చెప్పారు.
రూ. 2కోట్ల విలువైన మఠం నగలు తిరుపతి, చంద్రగిరి బ్యాంకుల్లో సురక్షితంగా ఉన్నాయని దాస్‌జీ గురువారం తెలియజేశారు. ఇంకా లాకర్ తాళాలు తన దగ్గరే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమిలాలలోని రూ. 20కోట్ల విలువైన భూమిని ప్రస్తుత మఠ మహంతు అర్జున్‌దాస్ అమ్మేందుకు యత్నించారని దేవేంద్రదాస్ ఆరోపించారు.
మరోవైపు.. హథీరాంజీ మఠానికి చెందిన నగలు తమ బ్యాంక్‌లో లేవని చంద్రగిరి స్టేట్ బ్యాంక్ మేనేజర్ స్పష్టం చేశారు. దాస్‌జీ 1964 నుంచి తమ బ్యాంక్‌లో నగలు భద్రపరచారన్నది అసత్యమని, తమ బ్యాంక్ 1965లో ప్రారంభమైందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే.. శ్రీవారి పరమభక్తుడైన హథీరాంజీ మఠానికి చెందిన 20 కోట్ల రూపాయల విలువగల ఆభరణాలు గల్లంతైన విషయం తెలిసిందే.