వెలుగుల పండుగ దీపావళిని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది దీపావళి పర్వదినాన ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ.
దీపావళి పండుగ రోజున స్వామివారికి నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలైన తోమాల, అర్చన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం తదితర సేవలను రద్దుచేశారు. సుప్రభాతం, ఎస్డీ సేవలు యధావిధిగా కొనసాగుతాయి.
మొదటిగంట నివేదన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని సర్వభూపాల వాహనంలో అధిష్టింపజేసి బంగారువాకిలి వద్దకు వేంచేపు చేస్తారు. మరొక పీఠంపై విష్వక్సేనుల వారిని వేంచేపు చేసిన తర్వాత నూతన వస్త్ర సమర్పణ, నివేదన, అక్షతారోపణ చేస్తారు.
చివరిగా హారతులు సమర్పించి తీర్థ చందన, శఠారి వితరణతో దీపావళి ఆస్థానం పరిసమాప్తమవుతుందని టీటీడీ యంత్రాంగం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
ఈ దీపావళి ఆస్థానంలో వేలాది మంది భక్తులు పాల్గొనవచ్చునని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని సదుపాయాలను కల్పించే రీతిలో చర్యలు తీసుకుంటున్నామని తితిదే అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.