తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కళ్యాణమస్తు కార్యక్రమంలో వినియోగించే మంగళసూత్రాలకు తిరుమలలో ప్రత్యేక పూజలు జరిపారు.
బుధవారం టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో తదితరులు మంగళసూత్రాలను బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి సన్నిధికి చేర్చారు. వాటిని మూలవర్ల పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించాక ఆస్థాన మండపానికి తరలించారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని కళ్యాణ వేదికలకు పంపించారు.
ఇకపోతే.. కళ్యాణమస్తు కార్యక్రమంలో పెళ్ళిళ్లు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించారు. ఈ నెల 26వరకు వధూవరులు దరఖాస్తు చేసుకోవచ్చునని ఛైర్మన్ ఆదికేశవులు తెలిపారు. కళ్యాణమస్తు ముహూర్తం విషయంలో వస్తున్న విమర్శలలో నిజం లేదన్నారు. ఇప్పటివరకు 2600 దరఖాస్తులు అందాయన్నారు.