కలియుగ ప్రత్యక్షదైవం, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఓ శుభవార్త. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైభవోపేతంగా జరిగిన శ్రీవారి కళ్యాణాన్ని.. ఇకపై దేశవ్యాప్తంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది.
శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి కళ్యాణాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు తీర్మానించింది. అలాగే తిరుమలలోనూ శ్రీవారి కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తితిదే ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు తెలిపారు.
శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్లు యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. హైకోర్టు తీర్పునకు కట్టుబడి డాలర్ శేషాద్రిని సాగనంపాలని కూడా తితిదే అధికారులు తీర్మానించారు.
ఈ సందర్భంగా ఈవో ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. డిసెంబర్ 28న వైకుంఠ ఏకాదశి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి శీఘ్రదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి ఆలయ మహాద్వార ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.