తిరుచానూరులో జరుగుతోన్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం పద్మావతీ దేవి పెద్దశేషవాహనంపై ఊరేగారు.
సర్వాలంకరణాభూషితురాలైన అమ్మవారు తిరుమాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని వేలాదిమంది భక్తులు తిలకించి, భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. ఇంకా శనివారం రాత్రి పద్మావతీ దేవి హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దాదాపు పది సంవత్సరాల తర్వాత అమ్మవారు పుట్టిన రోజైన శుక్రవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం విశేషం. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ధ్వజారోహణం కార్యక్రమంతో శుక్రవారం అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు నిర్వహణకు అష్టదిక్పాలకులు, సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆలయంలో స్వర్ణ ధ్వజస్తంభంపై ఉదయం 8.15 నుంచి 8.30 గంటల మధ్య వృశ్చక లగ్నంలో అధిరోహింపజేశారు. అంతకుముందు అమ్మవారి ఉత్సవమూర్తిని, గజపటాన్ని తిరుమాడ వీధుల్లో ఊరేహింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభం ముందు కొలువు దీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.