తిరుచానూరులో వెలసిన పద్మావతి అమ్మవారు సోమవారం రామభక్తుడైన హనుమంతుని వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం రాత్రి విల్లు చేతబట్టిన శ్రీరాముని అలంకరణలో అమ్మవారు తిరుమాడవీధుల్లో విహరించిన వైనాన్ని వేలాది మంది భక్తులు తిలకించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
తిరుచానూరులో జరుగుతోన్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఊంజల్ సేవ అనంతరం అమ్మవారిని వేంచేపుగా ఆస్థానమండపం నుంచి వాహన మండపానికి తీసుకువచ్చారు. విల్లు చేతపట్టిన శ్రీరాముని స్వరూపంగా పట్టు పీతాంబర, వజ్రవైడూర్య ఆభరణాలతో దేవేరి సర్వాంగసుందరంగా అలంకరించారు.
అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాటాల నడుమ హనుమంతునిపై అమ్మవారిని ఆశీనులు చేసి తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు.
అలాగే సోమవారం ఉదయం పద్మావతి అమ్మవారు కల్పవృక్షవాహనంపై రాజమన్నార్ అలంకరణలో తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. సోమవారం జరిగిన కల్పవృక్ష, హనుమంత వాహన సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.