తిరుచానూరులో జరుగుతోన్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం పద్మావతి అమ్మవారు సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సర్వాంగసుందరంగా అలంకృతమైన అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. సర్వభూపాల వాహనం సేవలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.
ఇకపోతే.. అమ్మవారికి బుధవారం 12 గంటలకు కృష్ణస్వామి ముఖమండపంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.30 గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్ సేవలు జరుగుతాయి.
అలాగే సాయంత్రం 4.30 గంటలకు స్వర్ణరథం, రాత్రి 8.30 గంటలకు గరుడ వాహన సేవలు జరుగుతాయని దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి పద్మావతీ దేవి స్వర్ణ గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఐశ్వర్యానికి సూచనంగా భావిస్తున్న గజవాహనంపై అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. సర్వాలంకార శోభితురాలైన పద్మావతిదేవి తనకు అత్యంత ఇష్టమైన గజవాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగిన వైనం భక్తులను కనువిందు చేసింది.