"భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమోనమః"
మనసును నియంత్రిస్తేనే మనిషికి క్రమశిక్షణ అలవడుతుంది. అదుపు తప్పిన ఆలోచనల్ని సంస్కచడం ద్వారా సక్రమ జీవన విధానం సాధ్యమవుతుంది. ఆపారశక్తి కేంద్రమైన మనిషికి ఇలాంటి సాధనలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆత్మశక్తిని సమృద్ధిపరచి అత్యున్నత స్థాయికి తోడ్కొని వెళ్తాయి. సనాతన ధర్మానువర్తులైన మునులు, యోగులు తపస్సుల అద్భుతాల్ని సాధించినా, అసాధ్యాల్ని సుసాధ్యం చేసినా వాటిని ప్రచోదితం చేసిన కీలకశక్తి ఇదే. కళ్ళెం తప్పిన గుర్రంలా, కట్టడి చెయ్యలేని ఆలోచనల్ని నియంత్రించే ఆధ్యాత్మిక విధానాల్లో శ్రీశబరిగిరివాసుడైన అయ్యప్పస్వామి దీక్ష ప్రధానమైంది.
కేరళ రాష్ట్రంలో పంపాతీరంలోని శబరగిరిని చేరుకోడం సాధారణ తీర్ధయాత్రలాంటిది కాదు. స్వామి సన్నిధికి తీసుకు వెళ్ళే అష్టాదశ సోపానాల్ని ఇరుముడితో అధిరోహించేందుకు అనేక అర్హతల్ని సంతరించుకోవాల్సి ఉంటుంది. నలభై రోజులపాటు ప్రత్యేకమైన పూజా విధానంతో, క్రమశిక్షణతో నిర్వహించాల్సిన మండల దీక్ష, ఆ దీక్షను ఆరంభమైన మాలధారణ, గురుస్వామి మార్గదర్శకత్వంలో సాగే యాత్రలాంటి వన్నీ ప్రత్యేకమైనవి. ఇలాంటి విశిష్ట వ్రతాచరణ కార్తీకమాసంలో ఆరంభమవుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినమైన ఎరుమేలి వద్ద జ్యోతిదర్శనంతో ముగుస్తుంది. అనంత సృష్టిని పోషించే హరి, పునస్సృష్ఠికోసం లయకార్యాన్ని నిర్వహించే హరుల మేలిమి అంశాలతో అవతరించిన శ్రీమణికంఠుడు శక్తి సంకేతమైన జ్యోతిరూపంలో దర్శనమిచ్చే అపురూప సన్నివేశాన్ని వీక్షించడంకోసం అసంఖ్యాక సంఖ్యలో భక్తులు నిర్వహించే శబరి యాత్ర పుణ్యప్రదం. స్మరణమాత్రంతో కరుణించే హరిహరాత్మజుడి దర్శనం అమోఘం. అనిర్వచనీయం.
``శరణమని అడుగనా స్వామి దారిపొడుగునా ఇరుముడి తలపైనా ఏ ఇడుములు తలపడునా గిరుల దారి సాగి శ్రీ శబరి దరిని చేరనా''
అంటూ పారవశ్యంతో కీర్తనలు ఆలపించే అయ్యప్ప భక్తకోటికి కార్తీకమాస ప్రవేశం ఆనందదాయకం. చలికాలంలో సూర్యోదయం కన్నా ముందే చన్నీళ్ళ స్నానం, ఏకభుక్తం, భూశయనంలాంటి కఠోర నియమాలు స్వామిని చేర్చే సాధనాలు. వాటిని అత్యంత శ్రద్ధతో, భక్తితో ఆచరించే వారికి ఎలాంటి శ్రమ కలుగదు కదా మానసిక, శారీరక పటుత్వం సిద్ధిస్తుందని రుజువైంది.
దీక్ష ఆరంభంనుంచి యాత్ర ముగిసే వరకు చెయ్యాల్సిన సాధన, ఆచరించాల్సిన నియమాలు శబరి గిరీశుని సన్నిధిలో భక్తకోటి పారవశ్యంలాంటి అంశాల గురించి ఈ శీర్షిక వివరంగా తెలియజేస్తుంది. కార్తీకం నుంచి మకరసంక్రాంతి వరకు అయ్యప్పస్వామి స్మరణతో వీక్షకుల్ని పునీతుల్ని గావిస్తుంది.
|