|
|
|
శబరిమలైలో `మండల పూజ'
|
|
|
|
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 24 మే 2007( 05:14 IST )
|
|
WD Employee
|
|
|
|
|
|
|
|
|
|
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శబరిమలై దేవస్థానాన్ని వార్షిక మండల పూజల నిమిత్తం డిసెంబరు 15వ తేదీ నుంచి తెరిచి ఉంచుతారు. మళయాళ నెల `వృశ్చికం' ప్రారంభ దినం సందర్భంగా 16వ తేదీ ఉదయం నూతన ప్రధాన పూజారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. డిసెంబర్ 26 వరకు మండల పూజలు కొనసాగుతాయి. అదేరోజు రాత్రి దేవాలయాన్ని మూసివేసి తిరిగి జనవరి ఒకటో తేదీన తిరిగి తెరుస్తారు. అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్ప స్వామి దీక్ష : మానవ జన్మకి పరమార్ధం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డుతగిలితే ``కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాన్ని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది. మాల ధరించుట : సూర్యుడు వృశ్చిక రాశియందు ప్రవేశించినది మొదలుకొని మకరరాశి ప్రవేశం వరకు రెండు మాసములు (వృశ్చిక-ధనస్సులు) అనగా కార్తీక, మార్గశిర మాసములలోనే శబరిమలకు వెళ్ళదగిన దినములు. అప్పుడే మకరజ్యోతిని ఉంచుతారు. మాలను తమ ఇష్టానుసారంమేరకు సొంతంగా ధరించరాదు. స్వామియందు నిశ్చలమైన భక్తిభావములు కలిగి, శబరిమలకు 3,4సార్లు వెళ్ళొచ్చి, బ్రహ్మచర్య వ్రతమును పాటించేవారిని గురుస్వామిగా ఎన్నుకొని, వారిచేత మాలను ధరించాలి. దీక్షావిధి : 1. దీక్ష తీసుకోదలచినవారు ముందుగా గురుస్వాముల ద్వారా ముద్రమాల ధారణ చేయించుకోవాలి. 2. ఇందుకు సామాగ్రి : నల్లరంగు లుంగీలు లేదా ప్యాంట్లు, నల్లరంగు చొక్కాలు, నల్లరంగు తువ్వాళ్లు, ఇంకా అవసరమైన బనీనులు, డ్రాయర్లు వంటివి కూడా రెండురెండు చొప్పున తీసుకోవాలి. నల్లని దుప్పటి ఒకటి తీసుకోవాలి. దీక్షాకాలం 41రోజులు ఈ వస్త్రాలనే వినియోగించాలి. 3. తులసిమాల, రుద్రాక్షమాల, గంధంమాల, తామరగింజలమాల, స్ఫటికముల మాల. వీటిలో మీకు నచ్చిన రెండు మాలలు మరియు అయ్యప్పస్వామి ముద్ర (డాలరు) తీసుకోవాలి. 4. పై సామాగ్రితో బాటు ఒక కొబ్బరికాయ, 6 అరటిపండ్లు, 100గ్రాముల నువు్వలనూనె, అగరువత్తులు, ఒక గంధపు పొడి డబ్బా, వీభూతి పొడి, కొద్దిగా కుంకుమ, కొన్ని పువు్వలు, కొద్దిగా జీడిపప్పు, కిస్‌మిస్, పంచదార, కర్పూరం. 5. పైన చెప్పిన సామాన్లు తీసుకొని గురుస్వాముల వద్దకు వెళ్ళి ``దీక్షామాల'' వేయవలసినదిగా ప్రార్ధించగా వారు తెల్లవారుజామున మీరు శిరస్నానం చేసిన తర్వాత, మీరు తెచ్చిన సామాగ్రితో అయ్యప్పస్వామికి పూజచేసి, ముద్రమాలను మీ మెడలో వేసి దీక్షను ప్రారంభిస్తారు.
దీక్షలో పాటించవలసిన నియమాలు : 1. ప్రతిరోజూ ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సంధ్యలలో తప్పనిసరిగా చన్నీటితో శిరస్నానం చేయాలి. 2. అప్పటివరకూ కట్టి విడిచిన బట్టలను తామే తడిపి ఆరేసి రెండవ జత పొడి దుస్తులను ధరించాలి. 3. విభూతి దానిపై గంధము, కుంకుమ-దీక్షా తిలకంగా దిద్దుకోవాలి. 4. దేవాలయంలోగానీ, పూజగదిలోగానీ దీపం వెలిగించి శరణు ఘోషలు చేయవలెను. 5. ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి, అయ్యప్పస్వామికి హారతులిచ్చి సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి. శక్తిమేరకు సాత్వికమైన అల్పాహారం తీసుకోవాలి. అంతటితో ఉదయం కార్యక్రమం పూర్తవుతుంది. 6. మధ్యాహ్నం చన్నీటి స్నానం చేసి, స్వామికి శరణుఘోషలు చెప్పి, సాత్విక ఆహారాన్ని భుజించాలి. 7. సాయంసంధ్యలో కూడా చన్నీటి స్నానమాచరించి, పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, భజనలు చేసి అల్పాహారమునే స్వీకరించాలి. 8. వెల్లుల్లి, నీరుల్లి, మద్యపానం, తాంబూలం, ధూమపానాలకు దూరంగా ఉండాలి. 9. దీక్షలో ఉన్నంతకాలం కటిక నేల మీదనే పడుకోవాలి. 10. బహిష్ఠులైన స్త్రీలను చూడడం, వారితో మాట్లాడడం చేయకూడదు. స్త్రీలతో లైంగిక సంబంధాలు కూడదు. 11. పాదరక్షలు ధరించకూడదు. అసభ్యకర సంభాషణ, కోపం అసలు పనికిరావు. 12. ప్రతిరోజు మూడు పూటలూ శరణు ఘోష చేయవలెను. పూజాద్రవ్యములు : స్వామి రూపముతో కూడిన తులసిపూసల మాల, తామరపూల దండ, దీపస్తంభాలు, సాంబ్రాణీ కడ్డీలు, కలశపాత్ర, అక్షింతలు, విడిపూలు, ఒక మూల పూలదండ, ఆవుపాలు, పన్నీరు, మంచినూనె, రెండు టెంకాయలు, రెండు కిలోల బియ్యం, పంచపాత్ర, ఉద్ధరిణి, నలుపు లేక కాషాయ వస్త్రాలు. పూజా విధానము : శ్రీ అయ్యప్ప పటమునకు ముందు ఒక దీపస్తంభం, పటమునకెదురుగా మరొక దీపస్తంభం, అరటి ఆకుపై బియ్యం పోసి దానిమీద ఒక దీపస్తంభం ఉంచవలెను. నాలుగు వైపుల 4 తమలపాకులు రెండేసి వక్కలు, ఒక టెంకాయను వుంచవలెను. మాలను ధరించువారు స్నానం చేసి, నీలవస్త్రమును ధరించి, తమ తల్లిదండ్రులకు నమస్కరించి, జగద్గురువుకు మొక్కి, అయ్యప్పను మనసార స్మరించి, ఆచారప్రకారం విబూదిని ధరించి గురువుకు నమస్కరించి మాలను ధరింప సిద్ధముగా ఉండవలెను.
ఇంటివద్ద పూజలు : తమ ఇళ్ల వద్ద పూజలు జరిపించదలుచుకున్న స్వాములు అయ్యప్ప పటములను ఉంచి పూజించవచ్చు. అష్టోత్తర పూజలు, భజనలు, లింగాష్టకం, ఉయ్యాలపాట మొదలగువాటిని 18 ప్రమిదలతో కర్పూర హారతి వెలిగించి ఇవ్వాలి. ఇంటికొచ్చిన స్వాములకు పాద నమస్కారములు చేసి వారికి సగౌరవంగా ఫలహారములు ఏర్పాటు చేయవలెను. ఈ విధంగా పూజలు నిర్వర్తించుకుని - స్వామి దర్శనమునకై ఇరుముడితో సన్నిధికి యాత్ర చేయవలెను. ఇరుముడి సామాన్లు : 1. రెండు అరలతో కూడిన ఒక పెద్దసంచి 2. రెండు చిన్న సంచులు, ఒక దుప్పటి 3. 8 కొబ్బరికాయలు, ఒక కిలో బియ్యం, 6 అరటిపండ్లు, కర్పూరం, అగరువత్తులు, ప్యాకెట్‌చందనం, ఒక తేనె సీసా, ఒక జాకెట్‌గుడ్డ. 4. పసుపు, కుంకుమ, కిస్‌మిస్, జీడిపప్పు, పటిక, పంచదార, అటుకులు, పేలాలు, మిరియాలు, అప్పడం, రోజ్‌వాటర్, తమలపాకులు, వక్కలు మొదలగునవి. శబరిమాల యాత్రా మార్గములు కొట్టాయం వరకూ రైలులో వెళ్లిన తర్వాత అక్కడ నుంచి 86 కి.మీ దూరంలో వున్న ఎరుమేలి, పంబలకు బస్సులోగానీ, కారులోగానీ వెళ్లవలెను. `పంపా' నదిలో స్నానం చేసిన పిదప శబరిమలైలోని స్వామి సన్నిధికి కాలినడకన వెళ్లవలెను. దీక్షా విరమణ : నియమ నిష్ఠలతో శబరిమల యాత్ర పూర్తయ్యాక మాల విసర్జన చేయవలెను.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|  | |