రాజధానిలో ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు కొదువ లేదు. అలాగే కలియుగ దైవం శ్రీనివాసుని ఆలయాలు కూడా కోకొల్లలుగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనది బిర్లా మందిరం. బహుశా ఈ ఆలయం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతినిత్యం ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.
రాజధాని నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ పక్కగా ఎత్తైన కొండపై నిర్మించబడిన ఆలయం ఈ బిర్లా మందిరం. బిర్లా ఫౌండేషన్ వారు నిర్మించిన ఈ ఆలయంలో పద్మావతి, ఆండాళ్ సమేత వెంకటేశ్వరులు మూలవిరాట్‌లు. ఆలయంలో ప్రవేశించగానే 11 అడుగుల ఎత్తు ఉన్న శ్రీనివాసుని విగ్రహం మైమరిపిస్తుంటుంది. ప్రక్కగా పద్మావతీ, ఆండాళ్ ఆలయాలు ఉంటాయి.
పూర్తిగా పాలరాయితో నిర్మించబడిన ఈ ఆలయంపై ఉండే గోపురం తామర పువ్వులవలె ఉండి దక్షిణ భారతీయులు, రాజస్థానీ ప్రజల కళాచారాలకు నిదర్శనంగా నిలుస్తోంది. పూర్తిగా ఉత్తర భారత కళాకృతులతో రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో పర్వదినాల రోజుల్లో ఉత్సవాలు అతివైభవంగా జరుగుతాయి.
కొండపైకి మెట్లద్వారా చేరుకుంటుండగానే నలువైపులా ఉండే విగ్రహాలు రాజస్థానీ కళాకృతులను తలపించచేస్తాయి. ఓ వైపు మనసుకు ఆహ్లాదం కలిగించే పచ్చని మొక్కలు... మరోవైపు హుసేన్ సాగర్ గాలి భక్తులనే కాదు పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంటాయి. దీంతో ఇది ఓ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి గాంచినది.
ఆలయం నుంచి చూస్తే ఓ వైపు మరులుగొలిపే హుసేన్ సాగర్, మరోవైపు జంటనగరాల హొయలు కనిపిస్తూ మనసును ఉత్తేజపరుస్తుంటాయి. సాయంత్రం సమయంలో మందిర దర్శనం ఓ అపూర్వమైన అనుభూతే. విద్యుద్ధీపాల అలంకారంలో ఆలయం సిరిమల్లెలా మనసును దోస్తుంది.
|