ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరానికి కుడివైపున వెలసిన క్షేత్రమే అమరామము. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతి సమీపంలో ఉత్తరాన గల ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానికి ప్రముఖ స్థానమున్న సంగతి తెలిసిందే. గుంటూరుకు సుమారు 27కి .మీ దూరంలో పావన కృష్ణానది తీరమున ఇంద్ర ప్రతిష్టగా నిలిచిన "శ్రీ అమరేశ్వర స్వామి" ఆలయం పంచారామాల్లో మొదటిది. ఇచ్చట స్వామివారితో పాటు "దేవేరి రాజ్యలక్ష్మీ" అమ్మవారిని కూడా భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఈ క్షేత్రం పూర్వకాలము నుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచింది. సుమారు 16 కి. మీ చుట్టుకొలత కలిగిన అమరావతి మహానగరానికి శిల్పాధామము అనే పేరు కూడా ఉంది. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధ మతం నీరాజనాలందుకొంది. మరుగునపడిన అమరావతి ప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. అనేక విడతలుగా చేపట్టిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు తదితర వస్తువులు లభ్యమయ్యాయి. ఇక్కడ లభ్యమైన ప్రతిష్టాత్మక శిల్పాల్లో ఎక్కువ భాగం మద్రాసు గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియంలలో భద్రపరిచారు. అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు ఈ ఆలయంలో చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి.అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానదిపై ప్రయాణించి అమరావతి చేరుకోవచ్చు.కార్తీక మాసమున పంచారామక్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన అమరారామములో వెలసిన శ్రీ అమరేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యఫలములు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. |