తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ప్రముఖ అరుణాచలేశ్వర సన్నిధి వెలసి ఉంది. ప్రముఖ శైవక్షేత్రమైన ఈ ఆలయంలో పరమేశ్వరుడు ఉన్నామలై దేవీ సమేత అరుణాచలేశ్వరుడుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయానికి ప్రతి నిత్యం దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.ప్రతిరోజూ భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం, ప్రసిద్ధ కార్తీక మాసంలో అశేష భక్తజనప్రవాహంతో నిండి ఉంటుంది. ఈశ్వరునికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని దర్శించుకుని మోక్షమార్గం పొందేందుకు భక్తజనులు ఈ ఆలయానికి భారీ ఎత్తున తరలి వస్తుంటారు. తమిళనాడు రాష్ట్రంలోని ఈ ఆలయానికి ఎలా వెళ్లాలంటే...? విలుపురం, కాట్పాడి రైల్వే మార్గం నుంచి 65 కి.మీ దూరంలో ఈ క్షేత్రం వెలసి ఉంది. చెన్నై నగరం నుంచి తిరువణ్ణామలైకి చేరుకోవడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం, శ్రీపెరంబుదూర్, సెంజి, దిండివనం వంటి పలు జిల్లాల నుంచి ప్రభుత్వ బస్సుల ద్వారా అరుణాచలేశ్వర సన్నిధానికి సులభంగా చేరుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే... ఈ ప్రసిద్ధ క్షేత్రంలో "గిరివలం" (కొండ ప్రదక్షిణ) ప్రాంతానికి సమీపంలో హెలికాప్టర్ దిగేందుకు వీలుగా ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనిద్వారా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకునే వీలుంది.దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం, బసచేసేందుకు వీలుగా రూ.100, రూ.200ల అద్దెతో అతిథి గృహాలను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. |