సంకల్‌బాగ్‌లో తితిదే నిర్వహించిన శ్రీవారి చక్రస్నానంతో తుంగభద్రమ్మ పుష్కరాలు వైభవంగా ముగిశాయి. పుష్కరాల్లో చివరి రోజైన ఆదివారం సంకల్‌బాగ్ ఘాట్ వద్ద తితిదే ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని ఉత్సవరులను వేంచేపుగా నదీ తీరానికి తరలించి, శాస్త్రోక్తంగా ముగింపు పూజలు నిర్వహించారు.అనంతరం తితిదే అర్చక స్వాములు వేద మంత్రాలతో ఉత్సవమూర్తులకు చక్రస్నానం గావించారు. వైభవంగా జరిగిన ఈ చక్రస్నానం ఉత్సవాన్ని పది లక్షల మంది భక్తులు పైగా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఇకపోతే... ఆదివారం సాయంత్రం ముత్తైదువులు, యువతులు తుంగమ్మ తల్లికి జేజేలు పలుకుతూ... నేతి దీపాలను నీటిలో వదిలారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే తుంగభద్రమ్మ పుష్కరాల్లో 11 లక్షల మంది పుణ్యస్నానమాచరించి ఆ తల్లి దీవెనలు పొందారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.12 రోజుల పాటు జరిగిన ఈ తుంగమ్మ పుష్కరాల్లో, దాదాపు 14లక్షలకు పైగా భక్తులు స్నానమాచరించారని అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్క ఆలంపూర్ ఘాట్ వద్ద... రెండులక్షల మంది భక్తులు స్నానాలు చేశారు.ఈ పుష్కర వేడుకలకు రాష్ట్రం నుంచి మాత్రమే గాకుండా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. తుంగమ్మ పుష్కరాల ముగింపును పురస్కరించుకుని అలంపూర్ శ్రీ బాల బ్రహ్మేశ్వర, శ్రీ జోగుళాంబ ఆలయం, రాఘవేంద్రాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. |