ఆలయాల రాష్ట్రంగా ప్రసిద్ధికెక్కిన తమిళనాడు రాష్ట్రంలో యంత్ర శనేశ్వరుడు కొలువుదీరాడు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని తిరు యేరికుప్పం గ్రామంలో ఈ ఆలయం ఉంది. 1800 సంవత్సరాల వెలసినట్టు చెప్పుకుంటున్న ఈ ఆలయం కుంభాభిషేకం ఈనెల 26వ తేదీన జరుగనుంది. నాయకర్ల కాలంలో నిర్మించినట్టుగా చెపుతున్న ఈ ఆలయంలో వెలసిన మూలవిరాట్టు విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా చెపుతున్నారు.
అందుకే మూల విరాట్టు గోపురాన్ని పూర్ణకుంభం లేకుండా నిర్మించడం జరిగింది. ఈ ఆలయ ప్రత్యేకత. దీనిపై ఆలయ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.శ్రీనివాసన్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న శనేశ్వర ఆలయాల్లో యంత్ర సన్నిధి కలిగిన ఆలయం ఇదొక్కటేనన్నారు. తిరు యేరికుప్పం శని భగవాన్ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే అన్ని రకాల పాపాలు, కష్టాలకు పరిష్కారం మార్గం లభిస్తుందన్నారు.
అంతటి మహిమాన్మితమైన యంత్ర శనేశ్వర ఆలయం చెన్నయ్‌కు 164 కిలోమీటర్ల దూరంలో వెలసి ఉందన్నారు. యంత్ర శనేశ్వర విగ్రహం 12 అడుగుల ఎత్తు, రెండు అండుగుల వెడల్పుతో ఉందన్నారు. ఇది 1800 సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు శాఖ నిపుణులు నిర్థారించారని చెప్పారు.
కాగా, కుంభాభిషేకం రోజున పరిహార పూజలు, అభిషేకాలు, హోమాలు, శని దోష పూజలతో పాటు ఇతర అర్చనలు చేస్తారని
File
FILE
చెప్పారు. అంతేకాకుండా సింహం, కన్య, తుల, మిథునం, కుంభం, ధనుస్సు నక్షత్రాల్లో జన్మించిన భక్తులు ఖచ్చితంగా శని దోష నివారణ పూజలు చేస్తే మంచిదని ఆలయ పూజారులు చెపుతున్నారు.
కుంభాభిషేకం రోజున కనీసం 3.5 లక్షల మంది భక్తులు తిరు యేరికుప్పానికి వస్తారని భావిస్తున్నట్టు శ్రీనివాసన్ తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు అన్నదానం, బస, రవాణా, మంచినీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.
యంత్ర శనేశ్వరుడు అనే పేరు రావడానికి ప్రధాన కారణం.. మూల విగ్రహం పైభాగం కుడివైపున సూర్యుడు, మధ్యలో శంఖు, ఎడమవైపున చంద్రాకారంలో ఉన్న గుర్తులు ఉన్నాయన్నారు. వీటి కింద నక్షత్రాకార కుండలంలో బీజాక్షరాలు ఉన్నాయని. దీని కింద భాగంలో లక్ష్మీ కటక్షా యంత్రం ఉందన్నారు. అందుకే దీనికి ఈ ఆలయానికి యంత్ర శనేశ్వర ఆలయం అనే పేరు వచ్చిందని వివరించారు. కాగా, ఈ గ్రామం ఆరణి-సంతవాసల్ మార్గంలో, చెన్నయ్- కాంచీపురం- ఆరణి రహదారి మార్గంలో ఉందని ఆయన వివరించారు.