సత్య సాయిబాబా ఇరవయ్యో శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన ఓ మత గురువు. ఈయనను గురువు, వేదాంతి, భగవంతుడి అవతారం అని పలువురు విశ్వసిస్తారు. ఈయన మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. భక్తులు ఆర్తిగా పిలుచుకునే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా... ప్రేమ, శాంతి, దయ, ధర్మం, అహింస భావనలే మానవ జాతికి ముక్తి మార్గమని ఉద్భోధించి, తాను స్వయంగా ఆచరించి మానవ జన్మ సార్ధకం చేస్తున్న అపర భగవానుడు.అనంతపురం జిల్లా, పుట్టపర్తి అనే గ్రామంలో... పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ అనే నిరుపేద దంపతులకి సత్యసాయి నవంబరు 23, 1926వ సంవత్సరంలో జన్మించారు. సత్యనారాయణ వ్రతం చేసిన తరువాత పుట్టిన సంతానం గనుక, ఈతనికి తల్లిదండ్రులు సత్యనారాయణ రాజుగా పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు.పుట్టపర్తికి దగ్గర్లో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సత్యనారాయణ రాజు ప్రాధమిక విద్య సాగింది. చిన్న వయసులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ఈయన మంచి ప్రావీణ్యత కనబరచాడు. తరువాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు. మార్చి 8, 1940న కొంత విచిత్రమైన ప్రవర్తన (తేలు కుట్టినట్లుగా) కనబరచాడు.ఈ సంఘటన తరువాత సత్యనారాయణ రాజు ప్రవర్తనలో మార్పులు కనబడసాగాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసేవాడు కాడు. 1940లో తాను షిరిడీ సాయిబాబా (1838-1918కు చెందిన ఫకీరు) అవతారమని ప్రకటించాడు. అదే పేరు తనకు పెట్టుకున్నాడు.సత్యనారాయణ రాజు అక్టోబర్ 20, 1940లలో, అంటే.. తనకు 14 ఏళ్ల వయసున్నప్పుడు... పుస్తకాలు వదిలేసి, "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పాడు. తరువాత, ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద మూడేండ్లకు పైబడే అతను గడిపాడు. అప్పుడే అతనిచుట్టూ ప్రజలు గుమికూడడం మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు. అప్పటినుండి అతను అదే విషయం చెబుతూ వచ్చాడు.ఇక అప్పటి నుంచి సత్యసాయిబాబాగా మారిన సత్యనారాయణ రాజుకు... 1944లో అతడి అనుచరులు (భక్తులు) ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని "పాత మందిరం" అంటారు. ఇప్పటి ఆశ్రమమైన "ప్రశాంతి నిలయం" నిర్మాణం మాత్రం 1948లో మొదలయ్యింది.1958 లో సత్య సాయిబాబా అనుచరులు సనాతన సారధి అనే అధికారిక పత్రికను ప్రచురిచడం ప్రారంభించారు. 1960 నుండి పాశ్చాత్య దేశాలనుండి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు సత్యసాయిని సందర్శించడం అధికం అయ్యింది. ఒక్క 1968లో మాత్రమే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతానికి సాయిబాబా భారత దేశం దాటి బయటకు వెళ్ళాడు. కాని అతని అనుచరులు, భక్తులు, సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.1960 లో ఒక ప్రవచనంలో తాను ఈ మానవ రూపంలో ఇంకా 59 సంవత్సరాలు ఉంటానని చెప్పాడు. 1984లో ప్రచురింపబడిన ఒక పుస్తకంలో.. "నా పాత శరీరంలో నేను ముసలివాడను, బలహీనుడను అయ్యాను గాని ఈ క్రొత్త శరీరంలో అలా కాను." అని సత్యసాయి చెప్పినట్లు వ్రాయబడింది.సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు. ఇతను సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు.ఐసాక్ టిగ్రెట్ట్, నారాయణ కస్తూరి, అబ్దుల్ కలామ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్‌మోహన్ సింగ్, టి.ఎన్.శేషన్, సుషీల్ కుమార్ షిండే, దానా గిల్లెస్పీ, ఆర్నాల్డ్ షుల్మాన్, బిల్ ఐట్కిన్, వ్లాడిమిర్ ఆంటొనోవ్, జొవాన్ బ్రౌన్, ఆలిస్ కోల్ట్రేన్, బెంజమిన్ క్రీమె, మేనార్డ్ ఫెర్గూసన్, పీటర్ ప్రుజాన్, గిరిజా ప్రసాద్ కొయిరాలా మొదలైన ప్రముఖులందరూ ఈ సత్యసాయిచే ప్రభావితమైనట్టివారే. |