ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
ఉజ్జయినిలోని 'మహాకాల్ ఆలయ' ప్రాశస్త్యం
WD PhotoWD
ఉజ్జయిని సమీపంలోని మహాకాల్ ఆలయం మహాశివుడికి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరు పొందింది. శివపురాణం ప్రకారం, దూషణుడు పేరు గల రాక్షసుడి విధ్వంసక చేష్టలతో విసిగి వేసారి పోయిన ఉజ్జయిని ప్రజలు అతగాడి భరతం పట్టాలని పరమశివుడిని వేడుకున్నారు. భక్తుల విన్నపానికి సంతసించిన శివుడు పవిత్ర జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు. రాక్షసుడిని సంహరించిన శివుడు భక్తులు కోరిక మేరకు తన ప్రతిరూపమైన లింగాన్ని ఉజ్జయినిలో నెలకొల్పాడు.

ఇది దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక శివలింగం. తాంత్రిక శాస్త్రానికి సంబంధించినంతవరకు ఈ ఆలయానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. కొన్ని చారిత్రక వాస్తవాలను బట్టి, వేదవ్యాసుడు, కాళిదాసు, బాణభట్ట, భోజరాజు వంటి వారు సైతం ఉజ్జయిని మహాకాలుడిని దర్శించి, పూజలర్పించారని తెలుస్తోంది.

పురాతనమైన ఈ మహాకాల్ ఆలయాన్ని 11వ శతాబ్దంలో పునర్నిర్మించారు. నిర్మించిన 140 ఏళ్ల తర్వాత సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్ ఉజ్జయినిపై దాడి చేసి ఈ ఆలయాన్ని ధ్వసం చేశాడు. ప్రస్తుతం ఉన్న ఆలయం మరాటా పాలకుల కాలంలోనిది. బాబా రామచంద్ర షానవి పేరుగల మరాఠా రాజవంశానికి చెందిన దివాన్ ఈ ఆలయాన్ని 250 ఏళ్ల క్రితం పునర్నిర్మించారు.

భస్మ హారతి నిత్యం జరుగుతున్న ఏకైక శివలంగం కావడం ఈ ఆలయం మరొక విశేషం. వేద మంత్రాల ఉచ్చారణతో, స్తోత్రాల ఆలాపనలతో, సంగీత వాయిద్యాల నడుమ ప్రతిరోజూ సాయంత్రం 4 - 6 గంటల మధ్య ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. భక్తుల భం భం బోలే నినాదాల మధ్య కొనసాగే ఈ హారతి కార్యక్రమం చూడవచ్చిన వారిని తన్మయులను గావిస్తుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా ప్రతి ఒక్కరూ ఈ హారతి కార్యక్రమంలో పాల్గొనాలని ఉవ్విళ్లూరతారు మరి.

పురాణాల ప్రకారం- గతంలో భక్తులు మృతదేహాలను కాల్చగా వచ్చే బూడిదకు ప్రార్ధనలు చేసేవారని తెలుస్తోంది. ఒకసారి, ఓ పూజారి బూడిద కోసం ఏ మృతదేహం దొరక్కపోవడంతో తన పుత్రుడినే కాల్చి పూజలు సమర్పించాడట. ఈ ఉదంతం తర్వాత, ఆవు పేడ కాల్చగా వచ్చిన భస్మంతో హారతి పూజలు చేసే కొత్త పద్ధతి మొదలైంది.
వీడియోను వీక్షించండి
  1 | 2 | 3  >>