అంబాజీ- గుజరాత్‌లోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతూ 'అంబా భవానీ'గా పిలవబడుతున్న దివ్య క్షేత్రం. అతి పురాతనమైన ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఎటువంటి దేవతామూర్తి కనిపించదు. దేవతామూర్తి పీఠం అక్కడ ఉంది. వస్త్రాలు మరియు ఆభరణాలు అలంకరించిన తీరు అక్కడ దేవతామూర్తి కొలువుదీరిన భ్రమకు లోను చేస్తుంది. 'జయ అంబే' అంటూ భక్తులు సాగించే నామ సంకీర్తనతో అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని ఉంటుంది.
ఈ అమ్మవారి కరుణాకటాక్షవీక్షణలతోనే రుక్మిణి, శ్రీకృష్ణుని భర్తగా పొందింది. ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు తలనీలాలు సమర్పించుకున్నాడని భక్తుల విశ్వాసం. అంబాజీ పట్టణంలో ప్రతి పౌర్ణమికి పెద్ద సంఖ్యలో చేరే భక్తులు 'లోక్ మేలా' పేరిట ఆధ్యాత్మిక ఉత్సవాన్ని జరుపుకోవడం ద్వారా అంబాజీ మాతను భక్తి ప్రపత్తులతో సేవించుకుంటారు.
విశ్వవిఖ్యాతి చెందిన రాజులు, సాధుజన గాయకులు అమ్మవారి పాదాల చెంత తమను తాము సమర్పించుకున్న పవిత్రమైన ఈ పుణ్య క్షేత్రం ప్రతి వర్ణానికి, సంతతికి చెందిన సాక్తేయులు మరియు భక్తులు తప్పనిసరిగా దర్శించవలసిన దివ్యధామంగా వాసికెక్కింది. విశ్వానికి అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తికి మూలమైన అంబాజీ దేశంలోని అతి పురాతనమైన 51 శక్తి పీఠాలలో ఒకటి.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉజ్జయినీలోని భగవతి మహాకాళి మహాశక్తి, కాంచీపురంలోని కామాక్షి అమ్మవారు, మల్యగిరిలో వెలసిన భ్రమరాంబ, కన్యాకుమారిలోని కుమరిక, గుజరాత్‌లోగల అనర్ట్‌లోని అంబాజీ, కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి, ప్రయాగలోని లలితాదేవి, వింధ్యలోని వింధ్యవాసిని, వారణాసిలోని విశాలాక్షి, గయలోని మంగళవతి, బెంగాల్‌లోని సుందరీ భవానీ మరియు నేపాల్‌లోని గుహ్యకేసరిలు శక్తిని సేవించే 12 ప్రధానమైన శక్తి పీఠాలుగా వినుతికెక్కాయి.
|