దేవాలయంలోని ప్రధాన గర్భగుడిలో జ్యోతిర్లింగం రూపంలో కొల్లూర్ మూకాంబికాదేవి కొలువబడుతుంది. శ్రీచక్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు వసించిన రీతిగా జ్యోతిర్లింగంలో ఆదిశక్తి కొలువుంటుందని చెప్పబడింది. గర్భగుడిలో ప్రకృతి, శక్తి, కాళీ, లక్ష్మి మరియు సరస్వతి విగ్రహ మూర్తులను మీరు చూడవచ్చు. జ్యోతిర్లింగానికి పశ్చిమ దిశగా పంచలోహలతో అద్భుతంగా రూపొందిన శ్రీదేవి పంచలోహ ఉత్సవ మూర్తి కొలువై ఉంటుంది. శంఖ, చక్రధారియై అభయహస్తాన్ని చూపుతున్న మూకాంబికా దేవి పద్మాసనంలో దర్శనమిస్తుంది.
దేవాలయంలో ప్రదక్షిణ చేస్తుండగా, అంతర ప్రాకారపు దక్షిణ భాగంలో దశభుజ గణపతి భక్తుల విఘ్నాలను తొలగిస్తూ కనిపిస్తాడు. అలాగే పశ్చిమ భాగంలో ఆదిశంకరాచార్యుని తపోపీఠం ప్రతిష్ఠితమై ఉన్నది. తపోపీఠానికి అభిముఖంగా పాలరాతిపై చెక్కబడిన ఆదిశంకరాచార్య విరచితాలతో కూడిన ఆదిశంకరాచార్యుని విగ్రహం ఉన్నది. ఆదిశంకరాచార్యుని విగ్రహం, తపోపీఠాన్ని దర్శించాలని ఆకాంక్షించే భక్తులు దేవస్థాన అధికారుల నుంచి ప్రత్యేక అనుమతిని పొందవలసి ఉంటుంది.
ఇక నైఋతి భాగంలో యజ్ఞశాల, వీరభద్రేశ్వర స్వామి విగ్రహం ఉంటాయి. మూకాసురుని సంహార సమయంలో దేవికి సహాయకునిగా వీరభద్ర స్వామి వ్యవహరిస్తాడు. వీరభద్రునికి ఇక్కడ విభూతి పూజను నిర్వహిస్తుంటారు. బాహ్య ప్రాకారంలో బలి పీఠం, ధ్వజస్థంభం మరియు దీప స్థంభం ప్రతిష్ఠితమైనాయి. ధ్వజ స్థంభం స్వర్ణ రేకులతో అలంకరించబడింది. కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరిగే దీపోత్సవంలో దీపాలతో దీపస్థంభం ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటుంది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
|