దక్షిణ కాళీగా ఇక్కడి కాళీ మాతను కొలుచుకునే భక్తులు దక్షిణ మార్గంలో వైదిక మరియు తాంత్రిక పద్ధతులలో అమ్మవారిని పూజిస్తుంటారు. నవరాత్రి కాలంలో అనేక ఉత్సవాలు ఇక్కడ కనులపండువగా జరుగుతుంటాయి.
చంపనేర్ కోట అక్కడ జరిగిన అనేక యుద్ధాలకు సాక్షిభూతంగా నిలుస్తోంది. యదార్థానికి రాజపుత్రుల ఏలుబడిలో ఒక వెలుగు వెలిగిన చంపనేర్ నగరం, 15వ శతాబ్దంలో గుజరాత్ ప్రాంతానికి చెందిన సుల్తాన్‌ల అధీనంలోకి వెళ్ళిపోయింది. అనంతరం హుమయూన్ పాలనలోకి వచ్చిన చంపనేర్, సుల్తాన్ బహుదూర్ షా, అక్బర్, మరాఠాల చేతులు మారి చివరకు బ్రిటీషు వారి పాలనలోకి చేరుకుంది.
చంపనేర్ నుంచి బయలుదేరే ఒక పర్వత మార్గం పావగఢ్‌కు దారి తీస్తుంది. మహాకాళి దేవాలయం కాళికా మాత రూపాన్ని తలపిస్తుంది, అక్కడ మహాకాళి రూపంతో పాటు బహుచర దేవత యంత్రం భక్తులను దీవిస్తూ కనిపిస్తుంటాయి. దేవాలయానికి వెళ్లే దారిలో ఛాసియా మరియు దుధియా తాలవో సరస్సులు భక్తులకు మానోల్లాసాన్ని కలిగిస్తుంటాయి.
చంపనేర్ నుంచి మూడు దశలలో పావగఢ్ పర్వతం ఏర్పడింది. మాచి హవేలిగా పేరున్న పీఠభూమి సముద్ర మఠానికి 1471 అడుగుల ఎత్తున ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు మాచి వరకు కొనసాగించబడ్డాయి. చిన్నపాటి హోటళ్ళు మరియు విశ్రాంతి గృహాలు మాచిలో దొరుకుతాయి. టెలియ టలవ్ మరియు దుధియా టలవ్‌లు మాచికి పైభాగాన ఉన్నాయి.
ప్రఖ్యాతి చెందిన మహాకాళి దేవాలయం పర్వత శిఖరాగ్రంపై కొలువై ఉన్నది. మహాకాళి మాత దేవాలయం చేరుకునేందుకు మాచి నుంచి రోప్-వే సదుపాయం ఉంది. అక్కడ నుంచి 250 మెట్లు ఎక్కి దేవాలయాన్ని సందర్శించవచ్చు. దేవాలయం పైభాగంలో ముస్లిం భక్తులు సందర్శించే పీర్ ఆదాన్‌షాహ్ దర్గా ఉంది.
|