అంతేకాకుండా చిక్కులతో సతమతమయ్యే సమయంలో ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తే వారి మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందని భక్తులు అంటుంటారు. తమకు లభించే సుఖసంతోషాలకు మేరిమాత వారధిగా ఉంటూ.. వారి కోర్కెలు తీర్చుతుందని పేర్కొంటారు. ఈ చర్చిలో ఉన్న గుమ్మటం (మద్భా ఆఫ్ ది చర్చ్) పోర్చుగీసు భవన నిర్మాణ కళతో నిర్మించారు. ఈ పీఠంపై నిర్మితమై ఉన్న అమ్మవారి విగ్రవం గత రెండు శతాబ్దాల క్రితం ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించినట్టు చరిత్ర చెపుతోంది.
ఇంత చారిత్రక ప్రసిద్ధిగాంచిన ముట్టం సెయింట్ మేరీస్ ఫోరెనా చర్చికు 900 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చర్చి కేంద్రీకృతమైన అళపుళా జిల్లాలోని చెర్తలా పట్టణం ఒక చిన్నపాటి వాణిజ్య కేంద్రంగా ఉందన్నారు. ఆరంభకాలంలో యూదు మతస్తులు ఇక్కడ నుంచి తమ వాణిజ్యం కార్యకలాపాలు కొనసాగించారు. ఏసుక్రీస్తుకు ఉన్న 12 మంది భక్తులలో ఒకరైన ధర్మదూత థామస్ ఇక్కడకు వచ్చినపుడు కొక్కమంగళం అనే ప్రాంతంలో బసచేసినట్టు చరిత్ర పేర్కొంటోంది. ఆయన కేరళ రాష్ట్రంలోని నెలకొల్పిన ఏడు చర్చిల్లో ఇదొకటిగా చెపుతారు.
ఆ తర్వాత కొద్దికాలానికి బాగా ప్రసిద్ధి చెందిన క్రైస్తవులు ముట్టం అనే ప్రాంతంలో మరో కొత్త చర్చిని 1023 సంవత్సరంలో నిర్మించారు. ఆ చర్చిలో పవిత్రమైన దేవమాతను ప్రతిష్టించి, ప్రత్యేక ప్రార్థనలతో కొలుస్తూ వస్తున్నారు. కన్యమాత పవిత్రతను తెలియజేసే విధంగా.. ప్రతి ఏడాది డిసెంబరు ఎనిమిదో తేదీన ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను 1476 సంవత్సరంలో పోప్ సిటస్-IV ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఈ ఉత్సవాలు క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
|