కైలాస పర్వతం... సముద్రమట్టానికి 22,028 అడుగుల ఎత్తైన మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరం. కైలాస పర్వతం మరియు చేరుకోవడానికి సాగించే ప్రయాణం అంతరాత్మ పిలుపుగా భక్తులు భావిస్తుంటారు. పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక నెలవులో వేల సంఖ్యలో మహర్షులు, సామాన్య మానవులు, తత్వవేత్తలు మరియు దేవతలు సైతం ధ్యాన ముద్రలో ఇక్కడి పవిత్రవాతావరణంలో మమేకమైపోతారు.
కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. కైలాస పర్వతం మరియు మానవసరోవరం సృష్టికన్నా పురాతనమైనవిగా ప్రతీతి. నాదం మరియు కాంతులతో మిళితమైన ఈ ప్రాంతంలో నిజమైన యోగి ఓంకారంలో విలీనమైపోతారు. భారతీయ తాత్విక చింతన మరియు నాగరికతకు ఈ ప్రాంతం హృదయ కేంద్రం వలె భాసిల్లుతున్నది. గొప్పదైన మానవసరోవరం భారతీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.
పర్వతం యొక్క ఏటవాలు భాగాన్ని కల్ప వృక్షం ఆపాదించుకున్న రీతిలో కనిపిస్తుంది. పర్వతం యొక్క దక్షిణ భాగం నీలమణి, తూర్పు భాగం స్ఫటికం, పశ్చిమ భాగం కెంపు మరియు ఉత్తర భాగం స్వర్ణంగా చెప్పబడింది. కుబేరుని రాజ్యం ఇక్కడే కొలువై ఉంది. మహావిష్ణువు కాలి బొటనవేలి నుంచి ఉద్భవించిన గంగా నది చాంద్రమాన వృత్తంలో ప్రవేశించి అనంతరం కైలాస పర్వత శిఖరం నుంచి దివికి ఏతెంచింది. గంగానది ఉధృతిని నియంత్రించేందుకు మహాశివుడు ఆమెను తన జటాజూటంలోకి స్వీకరించాడు.
బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటోంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్‌చొక్ ( బుద్ధుని ఉగ్రరూపం) ను బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. దీనినే ధర్మపాలగా పిలుస్తుంటారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తుంటారు. తొలి తీర్థాంకరులు ఇక్కడే నిర్వాణం పొందారని జైన మతస్థుల నమ్మిక. గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెప్తుంటారు.
|