భారతదేశం కనీవినీ రీతిలో మహిమాన్వితమైన శక్తులతో, మానవ రూపం దాల్చిన దైవ స్వరూపంగా భక్తుల పూజలందుకునే అత్యున్నతమైన సాధువుగా శ్రీ సాయి బాబా కొలవబడుతున్నారు (సాయి అనగా సాక్షాత్ ఈశ్వర స్వరూపమని అర్ధం). ఈ నిగూఢమైన ఫకీరు తొలిసారిగా తన దర్శనాన్ని యవ్వన దశలో ఉండగా షిరిడీ గ్రామంలో ఒసంగారు. నాటి నుంచి తన యావత్ జీవిత కాలాన్ని బాబా షిరిడీలోనే గడిపారు.
గత 1918 సంవత్సరంలో సమాధి చెందేంతవరకు తనను ఆశ్రయించిన భక్తులను ప్రేమానురాగాలతో ఆశీర్వదించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు చూపించేవారు. అత్యవసర సమయంలో తనను పిలిచినట్లయితే వెంటనే ఆదుకుంటానని చెప్పడం ద్వారా భక్తుల హృదయాలలో బాబా చిరస్థాయిగా నిలిచిపోయారు.
తరతమ బేధాలు పాటించక అందరికి ఆశీర్వచనాలు అందించడమే తన ధ్యేయంగా బాబా ప్రవచించారు. రోగుల వ్యాధుల నివారణ, జీవితాలను కాపాడుట, ఆశ్రితులకు రక్షణ, ప్రమాదాలను నివారించుట, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుట, ప్రజలందరిలో సమైక్య భావనను పాదుకొల్పుట వేయేల తనను ఆశ్రియించిన వారికి ఆధ్యాత్మిక భావనలను కల్పించడం ద్వారా తాను చేసిన ప్రవచనానికి కార్యరూపం ఇచ్చారు.
తన మాటలతో, చర్యలతో సాధకులకు మోక్ష మార్గాన్ని చూపిన ఆధ్యాత్మిక పథ నిర్దేశకుడు సాయిబాబా అని బాబా సమకాలీన భక్తులలో ఒకరైన భక్తుడు చెప్పియున్నారు. భక్తుల పాలిట దైవస్వరూపుడు సాయిబాబా. ఈ సత్యం భక్తుల స్వీయ అనుభవాలతోనే అవగతమవుతుంది. ఊహలకు అతీతమైంది.
|