|
శక్తిదేవత తుల్జా భవానీ
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | తుల్జా భవానీ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో కొలువై ఉంది. తుల్జా మాత ఛత్రపతి శివాజీకే కాదు అనేక కుటుంబాలకు... ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలలోని ప్రజలకు కుటుంబ దేవత. మహారాష్ట్రలోని మూడున్నర శక్తి పీఠాలు మరియు భారతదేశంలోని 50 శక్తిపీఠాలలో ఒకటి తుల్జా భవానీ ఆలయం.
భారతదేశంలో పూర్వం నైమిష్య అరణ్యం, దండకారణ్యం అని రెండు అడవులుండేవి. మహారాష్ట్రలో భాగమైన మరతవాడ అనే ప్రదేశం దండకారణ్యంలో ఉండేది. దీనిని యమునాచల పర్వతాలు లేదా బాలాఘట్‌గా పిలిచేవారు. యమునాచల పర్వతప్రాంతంలోని అడవులలో తుల్జాపూర్ ఉన్నది. ఈ ప్రాంతంలో సాలిగ్రాంతో తయారుకాబడి స్వయంభుగా వెలిసిన విగ్రహం ఉన్నది.
ఇక భవాని విగ్రహ ప్రతిష్టాపనను ఇతర దేవాలయాలతో పోల్చి చూసినప్పుడు ఒకింత తేడాను మనం గమనించవచ్చు. విగ్రహం స్థిరంగా ప్రతిష్టింపబడలేదు. సహజంగా చాలా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన స్థిరంగా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం విగ్రహం చలన స్థితిలో ప్రతిష్టించబడి ఉంది. అంటే విగ్రహం కదులుతుందన్నమాట. ఈ విగ్రహ ప్రతిష్టాపనను శ్రీయాత్రలో ఆదిశంకరాచార్యులవారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. విగ్రహం చలన స్థితిలో ఉండటంతో ప్రతి ఏటా మూడుసార్లు శ్రీయాత్రకు మాత తరలివస్తుంది.
తుల్జా భవానీ ఆలయం తుల్జా మాత దేవాలయ నిర్మాణ శైలి... హేమద్పంతి పద్ధతిలో గోచరిస్తుంది. అమ్మవారి దేవాలయాన్ని సమీపించిన మనకు అక్కడ రెండు పెద్ద మహద్వారాలు దర్శనమిస్తాయి. గుడిలో ప్రవేశించగానే మొదటగా 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనబడుతుంది. నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తుండటం ఇక్కడి విశేషం. గోముఖ్ సమీపంలో సిద్ది వినాయకుని ఆలయం దర్శనమిస్తుంది. ఆ తర్వాత సర్దార్ నింబాల్కర్ నిర్మించిన చక్కటి ఆకృతులతో తీర్చిదిద్దిన ఓ గేటును దాటుకుంటూ వస్తాం. ఈ గేటులోనికి ప్రవేశించిన మనకు రెండు ఆకృతులు కనబడతాయి. ఎడమవైపున మార్కేండేయ మహర్షి విగ్రహం ఉంటే కుడివైపున పెద్ద నగారా గోచరిస్తుంది. |