స్కంద పురాణం, శివపురాణం, లింగపురాణాల్లో శ్రీకాళహస్తి గురించి చెప్పబడి ఉంది. కాళహస్తీశ్వరుని పూజించి, కొండపై ఉన్న భరద్వాజుని అర్జునుడు కలిశాడని స్కందపురాణంలో ఉంది. అంతేకాదు కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడనీ, అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి రక్తం కార్చగా, వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడనీ, దీంతో పరమేశ్వరుని రెండవకంటి నుండి కూడ రక్తం కారటం మొదలయింది. శివ భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్నును కూడా పీకి స్వామి రెండో కంటికి అమర్చాడు. కన్నప్ప భక్తికి ప్రసన్నడునైన స్వామి ప్రత్యక్షమై అతనిని కరుణించి ముక్తి ప్రాసాదించాడు.
ఈ దేవాలయంలో రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. అంతేకాదు రుద్రాభిషేకం, పాలాభిషేకం...మొదలైన పూజలు కూడా జరుగుతాయి. దక్షిణకైలాసమనే పేరుతోపాటు సత్య మహా భాస్కరక్షేత్రమనీ , సద్యోముక్తిక్షేత్రమనీ, శివానందైక నిలయమనీ పిలుస్తారు. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.
చూడదగిన ఇతర సమీప దేవాలయాలు విశ్వనాధ ఆలయం, కొండపై ఉన్న కన్నప్ప ఆలయం, మణికర్నిక ఆలయం, సూర్యనారాయణుని ఆలయం, భరద్వాజ తీర్థం, కృష్ణదేవరాయ మంటపం, వేయిలింగాల కోన, కొండపై ఉన్న దుర్గాంబ ఆలయం, సుబ్రహ్మణ్య ఆలయం, దక్షిణ కాళి ఆలయం
ఎలా చేరుకోవటం... ఈ పుణ్యక్షేత్రానికి అతి సమీపానగల విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం( 20 కిమీ). తిరుపతి నుంచి కాళహస్తి ప్రయాణం ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది. ఇంకా చెన్నై, గూడూరు, మద్రాసు, విజయవాడ వంటి ప్రధాన నగరాలనుంచి రైలు సౌకర్యం ఉన్నది. అదేవిధంగా స్థానికంగా టాక్సీలు, ఆటోలు, సిటీ బస్సులు రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి లేదా చంద్రగిరి- తిరుపతి- అలిపిరి- రేణిగుంట, శ్రీకాళహస్తికి నడుస్తాయి.
ఎక్కడ బస చేయాలి... శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారు చిత్తూరు, తిరుపతిల్లో బసచేయవచ్చు. ఇక్కడ సామాన్య ప్రజలకు అందుబాటులో గల హోటళ్లు చాలా ఉన్నాయి.
|