కనీఫ్‌నాథ్ ఆలయంలో దానిమ్మ చెట్టు ఒకటి ఉండేది. ఈ వృక్షానికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి, ఆరాధించేవారు. ఈ వృక్షం కనీఫ్‌నాథ్ భక్తురాలు ధాలీభాయ్ స్మారకంగా వెలసిందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. కనీఫ్‌నాథ్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ భక్తురాలు ఇక్కడే జీవసమాధి అయ్యేందుకు నిర్ణయించుకున్న సమయంలో కనీఫ్‌నాథ్ దర్శనమిచ్చి దానిమ్మ వృక్షంగా ఎల్లప్పుడూ జీవంతో ఉండాలని ఆశీర్వదించినట్టు ఇక్కడి భక్తులు చెపుతుంటారు.
ఈ కారణంతోనే కనీఫ్‌నాథ్ ఆలయంలో దానిమ్మ వృక్షం వెలసిందని స్థానికుల విశ్వాసం. కనీఫ్‌నాథ్ ఆలయంలో మరో విశేషమేమిటంటే.. సమీపంలోని గ్రామాల్లో తలెత్తే సమస్యను పరిష్కరించే పంచాయతీ మందిరంగా కనీఫ్‌నాథ్ దేవాలయం వేదికగా నిలుస్తోంది. అంతేకాకుండా సమస్యలకు తగిన రీతిలో పరిష్కరించి సరైన తీర్పు వస్తుందని నమ్మకం ఇక్కడి స్థానికుల నమ్మకం.
ఇక్కడకు ఎలా చేరుకోవాలి... రోడ్డు మార్గం ద్వారా.. మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం వెలసి వుంది. అహ్మద్‌నగర్ నుంచి బస్సు లేదా టాక్సీల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
రైలు మార్గం ద్వారా.. ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అహ్మద్‌నగర్.
విమానమార్గం ద్వారా.. అహ్మద్‌నగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో పూణె విమానశ్రయం ఉంది. |