తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా తిరువైయారులో పుణ్య కావేరి నదీ తీరాన ఒక సమాధి ఉంది. ఇది పేరుకు మాత్రమే సమాధి. కానీ స్థానికులకే కాదు.. రాష్ట్ర వాసులకు అది ఒక ఆలయం. ఇక్కడ ప్రతి ఏడాది జనవరి నెల పుష్య బహుళ పంచమి రోజున పంచరత్న కీర్తనావళి పేరుతో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు జరుగుతాయి.
ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా.. ప్రపంచం నలుమూలల నుంచి కర్ణాటక సంగీత విద్వాంసులు, కళాకారులు తరలి వస్తారు. వీరంతా ఒక చోట చేరి, ఒకేసారి పంచరత్న కీర్తనలను ఆలపించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత.
దక్షిణ భారత దేశంలో అత్యంత ఆదరణ పొందిన సంగీత విద్యల్లో ఒకటైన కర్ణాటక సంగీత విద్యకు ప్రకటించని సంగీత కళా పీఠంగా వెలుగొందుతోంది. తన ఇష్టదైవమైన శ్రీ రాముని స్థుతిస్తూ వేలాది కీర్తనలు ఆలపించిన పుణ్యపురుడు శ్రీ త్యాగరాజ స్వామి సమాధినే ఇక్కడ ఆలయంగా భావించి పూజలు చేస్తుంటారు. కావేరి, కుడామురుటి, వెణ్ణారు, వెట్టారు, వడారు అనే ఐదు నదుల సంగమంలో ఈ ఆలయం కొలువైవుంది.
తిరువైయారులో 1767 సంవత్సరం జనవరి పదో తేదీన జన్మించిన త్యాగరాజర్.. అతి చిన్న వయస్సు నుంచి కర్ణాటక సంగీతంపై మక్కువ చూపి, సంగీతాన్ని బాగా వంటపట్టించుకున్నాడు. కర్ణాటక సంగీతంలో ఆరితేరినప్పటికీ.. త్యాగరాజర్ ఆలపించిన గీతాలు శ్రీరాముని స్థుతిస్తూ పాడినవి కావడంతో అవి భక్తి గీతాలుగానే మిగిలిపోయాయి.
చిన్న వయస్సు నుంచే శ్రీరామ భక్తిగీతాలు ఆలపించడాన్ని గమనించిన తంజావూరు రాజు.. త్యాగరాజర్‌కు తన సభ ఆస్థాన గాయకునిగా నియమిస్తూ.. ఆహ్వానాన్ని పంపారు. దీన్ని తృణప్రాయంగా త్యాగరాజర్ తోసిపుచ్చారు. తన భక్తి గీతాలాపన ఆ శ్రీరామునికే సొంతమని నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆయన సోదరుడు త్యాగరాజర్ ప్రార్థించే శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.
ఈ సంఘటనతో శోకసముద్రంలో మునిగి పోయిన త్యాగరాజర్ ప్రతి పుణ్యస్థలాన్ని సందర్శిస్తూ శ్రీరాముని స్థుతిస్తూ కీర్తనలు ఆలపించాడు. ఇలా ఒక పుణ్యయాత్రను విజయంతంగా పూర్తి చేసిన త్యాగరాజర్ చివరకు ఐదు నదులు కలిసే ఈ నదీ తీరానికి వచ్చి చేరాడు.
|