సాంగలిలో వెలసిన గణేష్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఈ ఆలయంలో ఉన్న గణేష్ విగ్రహం బంగారుతో తయారు చేసిందని, ఈ వినాయకుడు నిరంతరం జరి అంచుతో కూడిన వస్త్రాన్ని ధరించి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. అలాగే సాంగలి గణేశుడుని దర్శనం చేసుకున్న మరుక్షణమే భక్తులు ఉత్సాహ భరితులై భక్తి పారవశ్వంలో తేలిపోతారని పేర్కొంటారు.
సాంగలిలో ఉన్న ఈ ఆలయం గురించి తెలియని వారుండబోరని స్థానికులు అంటుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఎంతో సంతోషంగాను, శక్తి సంపదలతో తులతూగుతారనే ప్రతీక. 1844లో ఇక్కడ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతేకాదు ఇక్కడ అందమైన శివుడు, సూర్యుడు, చింతామన్షేశ్వరి, లక్ష్మినారాయణ్ జీ విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఆలయంలోని ఏకదంతుని విగ్రహానికి విలువైన ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు అలంకరించి ఉంటాయి. వినాయకుడితో పాటు ఉన్న సిద్ధి, బుద్ధి విగ్రహాలను దర్శనం చేసుకుంటే భక్తి పారవశ్యం పొందుతారు. ఆలయ ప్రధాన మార్గం ఎరుపు రంగులో నిర్మితమై వుంటుంది. ఇది ఆలయానికి వచ్చే భక్తులను అమితంగా ఆకర్షిస్తుంది.
ఆలయానికి సమీపంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. వర్షాకాల సమయంలో కృష్ణానదిలో వరద రావడం, దీనివల్ల ఆ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ వరద ముంపునకు గురికావడం ఆనవాయితీగా కనిపిస్తోంది. అందువల్ల ఆలయానికి అత్యంత రక్షణ కల్పిస్తూ నిర్మాణం సాగింది. అంటే భూమట్టానికి అత్యంత ఎత్తులో ఆలయాన్ని నిర్మించారు. శ్రీ జ్యోతిబా కొండ నుంచి తీసుకొచ్చిన బండరాళ్ళను ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు.
|