పాకిస్థానీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనరాదంటూ, ఐపీఎల్ డ్రగ్ ట్రిబ్యునల్ ఒక ఏడాదిపాటు నిషేధం విధించింది. దీంతో గత సంవత్సరం జరిగిన మొదటి దఫా ఐపీఎల్‌లో.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరపున ఆడిన అసిఫ్, ఏఫ్రిల్‌లో ప్రారంభం కానున్న రెండో దఫా ఐపీఎల్‌లో ఆడలేకపోవచ్చు.నిషేధిత ఉత్ప్రేరకమైన నాండ్రోలిన్ వాడినందుగానూ ఇరవై ఆరేళ్ల అసిఫ్ డోప్ పరీక్షల్లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. డోప్ పరీక్షల తర్వాత పాక్ క్రికెట్ బోర్డు తరపున అధికారిక క్రికెట్ ఆడకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికే నిషేధం విధించింది. తాజాగా ఐపీఎల్‌లో కూడా అసిఫ్‌పై నిషేధం విధించారు.పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ వెళ్లేందుకు వీసా నిరాకరించడంతో, ఐపీఎల్ నుంచి తనను వదిలిపెట్టాలని గత నెలలో డేర్‌డెవిల్ యాజమాన్యాన్ని అసిఫ్ కోరాడు. ఈలోగానే ఐపీఎల్ డ్రగ్ ట్రిబ్యూనల్ ఏడాది నిషేధం విధించటంతో, అసిఫ్ కోరుకున్నట్లుగానే స్వదేశంలోనే ఉండిపోవచ్చు. ఏమంటారు..?ఇదలా ఉంటే... ఐపీఎల్ ట్రిబ్యునల్ తనపై విధించిన నిషేధంపై అప్పీల్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ నిషేధం తనను బాధిస్తోందనీ.. తాను ఐ డ్రాప్స్ మాత్రమే వాడాననీ, నిషేధిత ఉత్ర్పేరకాలు అందులోకి ఎలా వచ్చాయన్న సంగతి తెలియదని ఇప్పటికే ట్రిబ్యునల్‌కు చెప్పాననీ వాపోతున్నాడు. |