ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సెమీఫైనల్స్ దగ్గర పడుతున్న కొద్దీ బలహీన జట్లు సైతం చక్కటి ప్రదర్శనను కనబరుస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ బెంగూళూరు రాయల్ ఛాలెంజర్స్ అని చెప్పుకోవచ్చు. బలహీన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ తర్వాతి స్థానంలో ఉన్న బెంగుళూరు జట్టు రాస్ టేలర్ పుణ్యమాని విజయాలను అందుకుంటోంది. అలాగే మెల్లిమెల్లిగా ఒక్కో మెట్టో ఎక్కుతూ ప్రస్తుతం ముంబై, పంజాబ్‌ల కన్నా బెంగుళూరు ముందంజలో ఉంది.
టేలర్ అత్యుత్తమ బ్యాటింగ్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌పై బెంగుళూరు జట్టు రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో బెంగుళూరు జట్టు.. తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అంతుకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు... 129 పరుగులకే ఆలౌట్ అయింది.
మాథ్యూ హెడెన్ 38 బంతుల్లో 60 పరుగులు మినహాయిస్తే మిగిలిన బ్యాట్సమెన్‌లు ఎవరూ నిలదొక్కుకోలేకపోవడంతో ప్రత్యర్థి ముందు చెన్నై తక్కువ లక్ష్యాన్ని ఉంచింది. హెడెన్ క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. అయినప్పటికీ కెప్టెన్ కుంబ్లే మిగిలిన బ్యాట్సమెన్‌లను త్వరగా పేవిలివయన్ చేర్చడంపై దృష్టి పెట్టాడు.
దీంతో పది ఓవర్లలోపే చెన్నై వంద పరుగులు పూర్తి చేసినా.. మిగిలిన బ్యాట్సమెన్‌లు వరుస పట్టడంతో తక్కువ లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు జట్టు 19.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టేలర్ 50 బంతుల్లో 46 పరుగులు చేశాడు.
ఒక దశలో చెన్నై బౌలర్లు విరామాల్లో వరుసగా వికెట్లు తీయడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. అయితే టేలర్ సమయోచిత బ్యాటింగ్ బెంగుళూరు విజయాన్ని అందించింది. కానీ చివర్లో టేలర్ కూడా అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ రసందాయకంలో పడింది.
కానీ చివరి ఓవర్లో వినయ్ కుమార్ ఫోర్ కొట్టి విజయానికి కావలసిన పరుగులను చేయడంతో బెంగుళూరు విజేతగా నిలిచింది. చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న టేలర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. |