దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా, ఆదివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. ఈ విజయంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది.
ఢిల్లీ బ్యాట్స్‌మన్లలో డివిలియర్స్ (55 బంతుల్లో 8 ఫోర్లతో 79 పరుగులు) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన దిల్షాన్ (33), కార్తీక్ (23) పరుగులతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది.
తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 136/9 స్కోరు చేయగలిగింది. 151 పరుగుల లక్ష్యంతో దిగిన రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్ వైఫల్యం వెంటాడింది. రాయల్స్ జట్టులో బోథా (37 పరుగులు), జడేజా (24), పటేల్ (23) తప్ప మిగిలిన ఏ ఒక్క బ్యాట్స్‌మెనూ రాణించలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి.
ఇకపోతే.. రాయల్స్ బౌలర్లలో మునాఫ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా, బోథా ఓ వికెట్ సాధించాడు. అదేవిధంగా, ఢిల్లీ బౌలర్లలో సాల్వి, మహరూఫ్ రెండేసి వికెట్లు పడగొట్టగా, నెహ్రా, నానెస్ చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
మరోవైపు.. బ్యాటింగ్‌తో మైదానంలో వీరవిహారం చేసిన డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. |