ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండో అంచె పోటీలో ఇంటిదారి పట్టింది. గత యేడాది అనూహ్యంగా టైటిల్‌ను ఎగురేసుకున్న షేన్ వార్న్ సేన.. ఈ దఫా సెమీస్‌కు ఒక అడుగు దూరంలో ఆగిపోయింది.
బుధవారం డర్బన్‌లో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్స్ సెమీస్ ఆశలపై కోల్‌కతా నైట్ రైడర్స్ నీళ్లు చల్లింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచుంటే సెమీస్‌లోకి అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉండేవి. కానీ, ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న కోల్‌కతా జట్టుకు ఇది టోర్నీలో మూడో విజయం కావడం గమనార్హం.
అంతకుముందు టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రారంభంలోనే చేతులెత్తేసింది. ఐదు ఓవర్లకే ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 101 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ నిర్ధేశించిన అతి తక్కువ విజయ లక్ష్యాన్ని సైతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆపసోపాలు పడుతూ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ సెమీస్‌కు వెళ్లకుండానే ఐపీఎల్-2 నుంచి నిష్క్రమించింది. |