డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ధాటికి శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సెమీ ఫైనల్స్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ బెంబేలెత్తింది. గిల్లీ బ్యాటింగ్ ప్రదర్శన ముందు ఢిల్లీ బౌలర్లు వెలవెలబోయారు. ఈ మ్యాచ్‌లో గిల్లీ క్రీజ్‌లో ఉన్నంత వరకు బంతి పట్టుకున్న ప్రతి బౌలర్‌కు ముచ్చెమటలు పట్టాయంటే అతిశయోక్తి కాదు.
ఢిల్లీ ఉంచిన 154 పరుగుల లక్ష్యాన్ని డెక్కన్ ఛార్జర్స్ 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైందంటే ఆ ఘనత పూర్తిగా గిల్‌క్రిస్ట్‌కే దక్కుతుంది. దీనిని ఎవరూ కాదనలేరు. లీగ్ దశలో పది మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన డేర్‌డెవిల్స్‌కు ఇక్కడ మాత్రం అదృష్టం కలిసిరాలేదు. సెమీస్‌లో ప్రత్యర్థి కెప్టెన్ వారికి శాపంగా మారాడు.
బలమైన ప్రత్యర్థిపై లక్ష్యఛేదనలో ఓపెనర్ గిబ్స్ (0) డకౌట్‌గా వెనుదిరగడంతో ఎదురుదాడి చేసేందుకు ఎవరైనా సంశయిస్తారు. అయితే గిల్‌క్రిస్ట్ మాత్రం ఇందుకు భిన్నంగా జట్టును ముందుకు నడిపించాడు. తొలి ఓవర్‌లోనే ఐదు ఫోర్లతో చెలరేగిన ఈ మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ మరో రెండు ఓవర్లు గడిచే సరికి ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌దే విజయం అనుకునేంతగా ఢిల్లీ బౌలర్లపై విరుచుకపడ్డాడు.
పదో ఓవర్‌లో గిల్లీ అవుటయ్యే సమయానికి డెక్కన్ ఛార్జర్స్ పటిష్ట స్థితిలో నిలిచి విజయానికి 52 పరుగుల దూరంలోనే నిలిచింది. అప్పటికి డెక్కన్ స్కోరు 102/3. ఇందులో గిల్లీ ఒక్కడు సాధించిన పరుగులు 85 (35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు). ఆ తరువాత మిగిలిన బ్యాట్స్‌మెన్ మరో 2.2 ఓవర్ల ముగిలివుండగానే లక్ష్యఛేదన పూర్తి చేశారు.
ఇదిలా ఉంటే మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్ (0), వార్నర్ (0)లను ఖాతా తెరవకుండానే పెవీలియన్ దారి పట్టించి డెక్కన్ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించినట్లు కనిపించారు. అయితే అనంతరం దిల్షాన్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా జారవిడుచుకొని మూల్యం చెల్లించుకున్నారు.
దిల్షాన్ (65), సెహ్వాగ్ (39), డివిలియర్స్ (26) సమయోచితంగా ఆడటంతో ఢిల్లీ జట్టు ప్రత్యర్థి ముందు బలమైన లక్ష్యాన్ని ఉంచగలిగింది. మిగిలిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ అందరూ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. గిల్‌క్రిస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్లీ కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ. సెమీస్‌లో ఢిల్లీ ఇంటిముఖం పట్టడంతో గత ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ ఈసారి ఏకంగా టైటిల్ బరిలో నిలిచింది. |