తొలి ఐపీఎల్ సీజన్ ఏమో కానీ.. రెండో ఐపీఎల్ సీజన్ మాత్రం అనూహ్య సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ సంచనాలకు దక్షిణాఫ్రికా మైదానాలు వేదికగా నిలుస్తున్నాయి. ఈ సీజన్ ఆరంభంలో బలహీన జట్లలో ఒకటిగా నిలిచిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్.. అనూహ్యంగా చెలరేగుతూ.. బలమైన ప్రత్యర్థి చెన్నైపై కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో నెగ్గింది.
బలమైన బ్యాటింగ్ లైనప్, చక్కటి బౌలింగ్ వనరులు ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై డెక్కన్ ఛార్జర్స్ అద్భుత విజయాన్ని మరువకముందే.. ఐపీఎల్‌లో మిగిలిన జట్ల కన్నా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నైపై బెంగుళూరు అద్భుత విజయం సాధించి అభిమానులకు కనువిందు చేసింది. కీలక తరుణంలో మనీష్ పాండే, రాహుల్ ద్రావిడ్‌ల చక్కటి ఇన్నింగ్స్‌తో ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై బెంగుళూరు ఘనవిజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగుళురూ రాయల్ ఛాలెంజర్స్ ఆరంభం నుండే కట్టుదిట్టంగా ఆడింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయగలిగింది. పార్థివ్ పటేల్ (36), మాథ్యూ హెడెన్ (26)లు చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. ధోనీ ((28), రైనా (20)లు కూడా రాణించారు.
బెంగుళూరు బౌలర్ల పొదుపైన బౌలింగ్‌తో చెన్నై స్లాగ్ ఓవర్లలో పరుగులు రాబట్టుకోలేకపోయింది. ఇంతలో ధోనీ, రైనాలు పెవిలియన్ చేరడం.. దీంతో పరుగులు మరింత మందగించాయి. చివర్లో మోర్కెల్ కొంత రాణించడంతో చెన్నై కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
బెంగుళూరు బౌలర్లలో వినయ్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా.. ప్రవీణ్, కలిస్, మెర్వ్‌లు చెరోవికెట్ తీసుకున్ననారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలను చేరుకుంది. ఓపెనర్ మనీష్ పాండే (48) అద్భుత ఇన్నింగ్స్‌కు ద్రావిడ్ (44) సయమోచిత బ్యాటింగ్ తోడవ్వడంతో బెంగుళూరు తేలికగా విజయలక్ష్యాన్ని పూర్తి చేసింది.
ఓపెనర్లు ఇద్దరు.. వెంటవెంటనే అవుట్ అయినా కొహ్లీ (24), రాస్ టేలర్ (17)లు చక్కగా రాణించారు. చెన్నై బౌలర్లలో మురళీధరన్ పొదుపైన బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. చక్కటి బ్యాటింగ్ చేసిన పాండేకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది. |