ఇండియన్ ప్రీమియర్ లీగ్-2(ఐపీఎల్)లో నేడు హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. గత ఐదు వారాలుగా జరుగుతున్న ఐపీఎల్‌లో మెరుపు విన్యాసాల సంగ్రామం తుది దశకు చేరింది. లీగ్‌లు, సెమీస్‌లు అన్నీ ముగిశాయి. ఇక మిగిలింది ఒకే మ్యాచ్... అది చాంపియన్స్ పోరు.
వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకువచ్చిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు గిల్లీ వీరబాదుడతో షాకిచ్చి దక్కన్ చార్జర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు కూల్ కుంబ్లే తన చాణక్యంతో చెన్నయ్‌కి చెక్‌పెట్టి రాయల్ ఛాలెంజర్స్‌ను టైటిట్ రేసులో నిలిపాడు.
గత సీజన్‌లో చివరి స్థానంలో ఉన్న చార్జర్స్ ఈ సారి ఫుల్ చార్జింగ్‌తో ఈ సారి ఏకంగా అగ్రస్థానంలో నిలవాలని తహతహలాడుతోంది. ముఖ్యంగా గిల్లీ నాయకత్వం, బ్యాటింగ్ సామర్థ్యం, బౌలింగ్ సమతూకం జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించింది. ఈ తెగువే ఎదురులేని ఢిల్లీనిఇంటిదారి పట్టించింది. వీరేంద్ర వీర బాదుడును అడ్డుకుంది. గిల్లీతో పాటు ఫైనల్లో గిబ్స్, సైమండ్స్, రోహిత్‌లు విజృంభించారంటే ప్రత్యర్థికి ఆద్యంతం గుండె దడే!
అవకాశాలు అడుగంటుతున్న దశలో గాడిన పడిన జట్టు బెంగళూరు రాయల్ చాలెంజర్స్. ఓడటం మరచి గెలవడం నేర్చిన కుంబ్లే సేన కూడా మార్పుతోనే గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది. కుంబ్లేనేమో తన అనుభవాన్నంతా రంగరించి జట్టును గాడిన పెట్టాడు. యువకులతో దీటుగా పోటీ పడి వికెట్లు తీస్తున్నాడు.
తోక లేని గాలిపటంలా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న బెంగళూరుకు విక్టరీ అనే గాలం వేసి పైకెగిసేలా చేశాడు. దీంతో జట్టును ముందుండి నడిపించసాగాడు. ఇతనికి అనుభవజ్ఞులైన కలీస్, ద్రవిడ్‌లతో పాటు కుర్రాళ్లు రాస్ టేలర్, విరాట్ కోహ్లీల సహకారం కూడా లాభిస్తోంది.
మనిష్ పాండే పరుగుల ప్రవాహం మళ్లీ కొనసాగితే ఛార్జింగ్‌కు కష్టాలు తప్పవేమోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ రోజు క్రికెట్ అభిమానులకు పండగ వాతారణం కనపడనుంది. |