ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ కప్‌ను హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ కైవసం చేసుకుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన ఫైనల్స్‌లో డెక్కన్ ఛార్జర్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. గత సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన జట్టు ఈసారి సగర్వంగా కప్‌ను సొంతం చేసుకుంది.
గత సీజన్‌లో కిందనుంచి రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రెండో సీజన్‌కు వచ్చేసరికి రన్నరప్‌గా నిలిచింది.ట్వంటీ- 20 క్రికెట్‌లో చోటుచేసుకునే అద్భుతాలను ఐపీఎల్- 2లో ఈ రెండు జట్లు మరోసారి కళ్ల ముందు నిలిపాయి. ఫైనల్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై 144 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేయగలిగింది.
పోరాడి ఫైనల్స్‌కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ ఇక్కడ ఓడినా గట్టి పోరాటపటిమ కనబరిచింది. మ్యాచ్ మొత్తం రెండు జట్లు నువ్వానేనా అన్నరీతిలో ఆడాయి. లక్ష్యసాధనలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆచితూచి ఆడింది. కలీస్ (16), వాండర్‌మెర్వ్ (32), రాస్ టేలర్ (27), ఉతప్ప (17) జట్టును విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు.
సరైన సమయంలో వికెట్లు పడగొడుతూ బెంగళూరును ఒత్తిడిలోకి నెట్టిన డెక్కన్ బౌలర్లు చివరకు జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఓజా మూడు వికెట్లు పడగొట్టగా, సైమండ్స్, హర్మీత్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోయి పరాజయం మూటగట్టుకుంది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ సెమీస్‌కు పూర్తి భిన్నంగా ఆడింది. ఛాలెంజర్స్ కెప్టెన్ కుంబ్లే తొలి ఓవర్‌లోనే ప్రమాదకర బ్యాట్స్‌మెన్ గిల్‌క్రిస్ట్ (0)ను పెవీలియన్‌కు పంపడంతో ఆ జట్టు సగం గెలిచినంత సంబరం చేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు ఆ తరువాత డెక్కన్‌ను ఏ దశలోనూ పెద్దగా కోలుకోనివ్వలేదు.
దీంతో డెక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. గిబ్స్ (53 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. సైమండ్స్ (33), రోహిత్ శర్మ (24) చెలరేగి ఆడే ప్రయత్నం చేసినప్పటికీ కుంబ్లే మరోసారి ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. వీరిద్దరిని పెవీలియన్ దారిపట్టించి డెక్కన్ స్కోరు వేగానికి కళ్లెం వేశాడు.
కుంబ్లే నాలుగు వికెట్లు పడగొట్టగా, వినయ్ కుమార్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించిన అనిల్ కుంబ్లే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సిరీస్ మొత్తం భీకరమైన ఫామ్‌తో జట్టును ముందుండి నడిపించిన డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. |