ఇంగ్లాండ్‌లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో పదకొండేళ్ల క్రితం టెస్టు అరంగేట్రం చేసిన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. తొలి టెస్టులో తొలి సెంచరీకి కేవలం ఐదు పరుగుల దూరంలో నిలిచాడు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. 'మిస్టర్ కూల్', 'ది వాల్', 'మిస్టర్ డిపెండర్' వంటి ఎన్నో నిక్ నేమ్‌లు తన సొంత చేసుకున్నాడు. నాడు ఓ జట్టులో ఓ సభ్యునిగా లార్డ్స్‌లో పాదంమోపిన రాహుల్ నేడు అదే భారత జట్టుకు నాయకుడిగా టెస్టు సిరీస్ ఆడనున్నాడు. భారత టెస్టు క్రికెట్ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో తన తొలి టెస్టు అనుభూతులను నెమరు వేసుకుంటా పులకించి పోతున్నాడు 'ది వాల్'.
'క్రికెట్ మక్కా'గా లార్డ్స్
‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో 1996లో భారత్ తరపున బరిలో దిగి, విశేషంగా రాణించిన ఆటగాడు ద్రావిడ్. సెంచరీకి సమీపంలో వచ్చి, 95 పరుగుల వద్ద ఆగాడు. గురువారం ఇంగ్లండ్‌తో ఆరంభమయ్యే తొలి టెస్టులో భారత్‌కు నాయకత్వం వహించనున్న ద్రావిడ్ పదకొండేళ్ల క్రితం లార్డ్స్ మైదానంలో ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజారడంపై ఏమాత్రం విచారం లేదని నిర్మొహమాటంగా చెప్పాడు. తొలి టెస్టులో సెంచరీ చేసి ఉంటే.. లార్డ్స్ మైదానంలో టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన హీరోల సరసన నాలుగో వాడిగా స్థానం పొందేవాడు.
|