భారత పర్యటనకు ఎంపిక కాకపోవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించి ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ను ఓ ప్రత్యేకమైన క్రికెటర్‌గా చెప్పుకోవచ్చు. ఆల్‌రౌండర్‌గా ఆసీస్ క్రికెట్ జట్టులోకి ప్రవేశించిన సైమండ్స్ తన బ్యాటింగ్, బౌలింగ్ విన్యాసాలతో ప్రస్తుతం వరకు ఓ నమ్మదగిన ఆటగాడిగానే కొనసాగాడు.
ఆటగాడిగా క్రమశిక్షణ తక్కువని పేరు తెచ్చుకున్న సైమండ్స్ మైదానంలో మాత్రం ఎప్పుడూ తన సత్తా చూపడానికి వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థి బౌలర్‌పై విరుచుకుపడి బ్యాటింగ్ చేసే సైమండ్స్ ఆసీస్ జట్టులో కీలకమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్ పర్యటనకు ముందు బోర్డు మీటింగ్‌కు హాజరు కాకుండా చేపల వేటకు వెళ్లాడన్న కారణంగా నిషేధానికి గురైన సైమండ్స్ తాజాగా భారత్‌లో పర్యటించనున్న ఆసీస్ జట్టుకు సైతం ఎంపిక కాకపోవడం గమనార్హం. సైమండ్స్ ఆటగాడిగా గొప్పవాడైనా ప్రవర్తనలో మాత్రం అతను తనను తాను ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది అంటూ ఆసీస్ బోర్డు పేర్కొంటున్న సమయంలో సైమండ్స్ కెరీర్ గురించి ఓసారి పరిశీలిద్దాం.
ఇంగ్లాండ్‌లో 1975 జూన్ తొమ్మిదిన జన్మించి ఆస్ట్రేలియాలో పెరిగిన సైమండ్స్ 1998లో పాకిస్థాన్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆనాటి నుంచి నేటివరకు 193 వన్డేల్లో పాల్గొన్న సైమండ్స్ 157 ఇన్నింగ్స్‌లు ఆడి 5006 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు 29 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు సైమండ్స్ ఆడిన వన్డేల్లో స్ట్రైక్ రేటు 92.78గా ఉండడం విశేషం.
|