భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లుగా చెప్పదగినవారిలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరును సైతం నిస్సందేహంగా చేర్చవచ్చు. ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు సాధించిన గంగూలీ కెరీర్‌లో ఎన్నో చెప్పుకోదగ్గ విశేషాలున్నాయి.
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రాణించిన గంగూలీకి ఒకానొక దశలో దేశం యావత్తూ నీరాజనాలు పలికింది. బెంగాల్ టైగర్, కోల్‌కతా ప్రిన్స్, దాదా అంటూ అభిమానులు ముద్దు పేరుతో పిల్చుకునే సౌరవ్ చండీదాస్ గంగూలీ పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్‌కతాలో ఆగస్ట్ ఏడు 1972లో జన్మించాడు.
అటుపై 1992 జనవరి 11న బ్రిస్‌బేన్‌లో వెస్ట్ ఇండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రంగ ప్రవేశం చేశాడు. తొలి మ్యాచ్‌లో కేవలం మూడే పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన గంగూలీ అటుపై కెరీర్‌లో అందరూ మెచ్చుకోదగ్గ స్థాయిలో రాణించడం విశేషం.
అలాగే 1996లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గంగూలీ ఇప్పటికే నూరు టెస్టులు పూర్తి చేసుకోవడం విశేషం. ఆటగాడిగా టెస్టుల్లో ఇప్పటివరకు 6888 పరుగులు సాధించిన గంగూలీ టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 15 సెంచరీలు, 34 అర్థ సెంచరీలు ఉన్నాయి.
దీంతో పాటు ఇప్పటివరకు 311 వన్డేలాడిన గంగూలీ 22 సెంచరీలు, 72 అర్ధ సెంచరీలతో పాటు 11363 పరుగులు సాధించాడు. బ్యాట్స్‌మెన్‌గానే కాక తాను ఆడిన టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు సాధించి బౌలింగ్‌లోనూ తన సత్తా చాటడం విశేషం. ఆటగాడిగా ఇంతటి పేరు సాధించిన గంగూలీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి జట్టును విజయ పథంలో నడిపించాడు.
|