రెండో వన్డేలో అనూహ్యంగా ఖంగుతిన్న "టీమ్ ఇండియా" మూడో వన్డే కోసం పూర్తిగా సమాయత్తమైంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఆదివారం జరిగే ఈ వన్డే నుంచి ఇండో-పాక్ మ్యాచ్‌లలో ఉండే అసలైన మజా ఆరంభంకానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు సమాన ఆధిక్యంలో ఉండటంతో మూడో వన్డే రెండు జట్లకు అత్యంత కీలకం కానుంది.
ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌పై పట్టు సాధించేందుకు ఇరు జట్లూ తమ సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో బ్యాటింగ్‌కు స్వర్గధామ మైన కాన్పూర్ పిచ్‌పై మరో పసందైన పోరు అభిమానులకు కనువిందు చేయడం ఖాయం.
ఒత్తిడిలో టీమ్ ఇండియా.. బ్యాటింగ్‌కు అనుకూలించే మొహాలీ పిచ్‌పై మంచి ఫామ్‌లో ఉన్న మురళీ కార్తీక్‌ను పక్కనబెట్టి ఐదోబౌలర్ లేకుండా బరిలోకి దిగినందుకు భారత్ తగు మూల్యమే చెల్లించుకుంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు నేలపాలు చేయడం, పేలవమైన ఫీల్డింగ్ కూడా భారత్ కొంపముంచింది. అందువల్ల రెండో వన్డేలో విఫలమైన సెహ్వాగ్‌కు మరో ఛాన్స్ ఇస్తారా..? లేక మళ్లీ కార్తీక్ వైపే మొగ్గుచూపుతారా..? అన్నది చర్చనీయాంశం.
మరోవైపు ఐదోబౌలర్ పాత్రను దాదా సమర్థంగా నిర్వహించినా ప్రస్తుత జట్టులో పెద్దదిక్కుగా ఉన్న జహీర్ ధారాళంగా పరుగులు ఇవ్వడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. సచిన్, గంభీర్, యువరాజ్ ఫామ్‌లో ఉండడం ఆనందం కలిగించే అంశం. ఉతప్ప, ధోనీలే జట్టుకు భారీస్కోరు చేయాల్సి వుంది.
ఇక పోతే రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన పాక్ జట్టు రెట్టించిన సమరోత్సాహంతో ఉంది. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అక్తర్ బ్యాటింగ్‌కు అనుకూలించే మొహాలి పిచ్‌పై కూడా మూడు వికెట్లు పడగొట్టి తిరిగి ఫామ్‌లోకి రావడం వారి బలాన్ని మరింత పెంచింది. యూనిస్‌ఖాన్ అద్భుత ఫామ్‌లో ఉండడం, మిస్బావుల్ హక్ చక్కని సహకారం అందిస్తుండడం పాక్‌కు ఊరట కలిగించే అంశం.
ఆఫ్రిదితో జర జాగ్రత్త... ఈ మైదానంలో భారత్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా ఐదు మ్యాచ్‌లలో నెగ్గింది. ఇది కొంతమేరకు భారత్‌కు అనుకూలించే అంశమైనప్పటికీ.. చివరిసారి 2005లో పాక్‌తోనే జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పాక్ చిచ్చరపిడుగు షాహిద్ ఆఫ్రిది కేవలం 45 బంతుల్లో సెంచరీ చేసి పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు.
|