భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న మూడో టెస్టుకు వెస్టిండీస్ అంపైర్ స్టీవ్ బక్నర్‌ను తొలగించారు. తప్పుడు నిర్ణయాలతో భారత్ ఆటగాళ్లను అవుట్‌గా ప్రకటించడమే కాకుండా.. రెండో టెస్టులో ఆసీస్‌కు విజయం చేకూర్చి పెట్టినందుకు బక్నర్‌పై ఐసిసి చర్య తీసుకుంది. దీంతో.. కొంత మేరకు సమస్య సద్దుమణిగినప్పటికీ.. మిగిలిన సిరీస్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా.. జాతి వివక్ష ఆరోపణలు చేసినట్టు ఎలాంటి ఆరోపణలు లేకపోయనప్పటికీ హర్భజన్ సింగ్‌పై మూడు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసిసి విధించింది.
అయితే.. ఈ నిషేధ ఉత్తర్వు కాపీలను ఐసిసి రిఫరీ మైక్ ప్రొక్టర్ ఇంకా అందజేయలేదు. ఈ కాపీల కోసం టీమ్ ఇండియా పట్టుబడుతోంది. ఇవి ఇస్తేగానీ ఐసిసి అప్పీలు కమిటీకి అప్పీలు చేసే అవకాశం ఉంది. అలా అప్పీలు చేస్తే.. భజ్జీపై విధించిన మూడు మ్యాచ్‌ల నిషేధం తక్షణ అమలులోకి రాదు. లేనిపక్షంలో మూడో టెస్టు నుంచే భజ్జీని దూరంగా ఉంచాల్సి వస్తుంది.
ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మూడో టెస్టుకు ముందు జరిగే ప్రాక్టీసు మ్యాచ్ జరిగే కాన్‌బెర్రాకు వెళ్లబోమని టీమ్ ఇండియా ప్రకటించింది. దీంతో.. బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో సోమవారం ఉదయం అత్యవసరంగా బోర్డు సమావేశమైంది. అంతేకాకుండా.. బోర్డు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు సిడ్నీని వదిలి కాన్‌బెర్రాకు వెళ్లవద్దని పేర్కొంది.
|