భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు (బీసీసీఐ)కు సమర్పించిన నానావతి కమిషన్ నివేదికను విచారణ కమిటీ పరిశీలించేందుకు గాను సరైన తేదీని బుధవారం ఖరారు చేయనున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ ఈ తేదీని వెల్లడిస్తారు. భారత క్రికెట్ బౌలర్లు శ్రీశాంత్-హర్భజన్ సింగ్ చెంపదెబ్బ వ్యవహారం క్రికెట్ ప్రపంపంలో పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెల్సిందే.
ఐపీఎల్ టోర్నీ మ్యాచ్‌లలో భాగంగా వీరిమధ్య ఈ గొడవ జరిగింది. ఫలితంగా శ్రీశాంత్ హెచ్చరికతో శిక్ష నుంచి తప్పించుకోగా, భజ్జీపై పది ఐపీఎల్ మ్యాచ్‌ల నిషేధం విధించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించేందుకు బీసీసీఐ నానావతి కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 14 పేజీల నివేదికను తయారు చేసి, దాన్ని మంగళవారం బీసీసీఐకు సమర్పించింది.
దీనిపై బీసీసీఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి రత్నాకర్ షెట్టి స్పందిస్తూ.. నానావతి కమిషన్ నివేదిక షీల్డు కవర్‌లో అందిందని, దీనిని క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఇందుకోసం ఒక తేదీని శరద్ పవార్ నిర్ణయిస్తారని చెప్పారు.
ఈ క్రమశిక్షణా కమిటీకి పవార్ నేతృత్వం వహిస్తుండగా, అధ్యక్షుడిగా (ఎలెక్ట్) శశాంక్ మనోహర్, చిరయు అమిన్‌లు ఉపాధ్యక్షుడిగాను, మరో ఇద్దరు సభ్యులుగా ఉన్నట్టు చెప్పారు. నివేదికపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు. దీనిపై క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకోవాలని రత్నాకర్ షెట్టి అన్నారు.
|