కుడిచేతి మణికట్టు గాయం కారణంగా దక్కన్ ఛార్జర్స్ జట్టు కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్ టోర్నీలోని మిగిలిన లీగ్ మ్యాచ్‌ల నుంచి నిష్క్రమించాడు. లక్ష్మణ్ స్ధానంలో గిల్‌క్రిస్ట్ పూర్తిస్థాయి సారథ్యం బాధ్యతలు చేపట్టాడు. అదేసమయంలో రోహిత్‌శర్మను వైస్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు డెక్కన్ ఛార్జర్స్ ప్రకటించింది.
ఈ విషయమై లక్ష్మణ్ మాట్లాడుతూ తాను గాయం నుంచి కోలుకోడానికి మరో రెండు వారాలు పడుతుందని అందుకే ప్రస్తుతం తాను జట్టుకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు. ఐపీఎల్ టోర్నీలో తాము పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్నామన్న సంగతి తనకు తెలుసని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
అయితే ఈ విషయమై యాజమాన్యం నుంచి జట్టుకు ఎలాంటి ఒత్తిళ్లు ఎదురుకాలేదని లక్ష్మణ్ అన్నాడు. యాజమాన్యం జట్టుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని లక్ష్మణ్ వివరించాడు.
బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో మే 3న జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్ష్మణ్ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటినుంచి లక్ష్మణ్ స్థానంలో గిల్‌క్రిస్ట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
|