ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొన్ని వేదికలను ఎంపిక చేసింది. ఈ వేదికలపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసిబి) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే నవంబర్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో రెండు వార్మప్ మ్యాచ్‌లతో సహా ఓ టెస్ట్ మ్యాచ్‌ని కూడా ముంబైలోనే నిర్వహించేలా బీసీసీఐ వేదికను ఖరారు చేసింది.
దీనిపై ఈసీబీ నిరసన వ్యక్తం చేసింది. మొత్తం ఏడు వారాల భారత పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు, ఏడు వన్డేలు, చివరగా రెండు టెస్ట్‌లు ఆడనుంది. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, మొహాలీ వంటి పెద్ద వేదికలను విస్మరించడాన్ని ఈసీబీ తప్పుపట్టింది.
ఈడెన్ గార్డెన్స్, చిదంబరం వంటి గొప్ప స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించకుండా ఎక్కడో ఉన్న గౌహతి, జంషెడ్‌పూర్ లాంటి చిన్న వేదికలను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించింది. వేదికలకు సంబంధించి తాము చేసిన విజ్ఞప్తులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) పట్టించుకోలేదని ఈసీబీ ప్రతినిధులు ఒక ప్రకటనలో ఆరోపించారు.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగనున్న క్రికెట్ సిరీస్ కోసం బీసీసీఐ చేసిన ప్రతిపాదిత షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. నవంబర్ 6వ తేదీ ఇంగ్లాండ్ జట్టు ముంబై రాక, 9న వన్డే వార్మప్ మ్యాచ్ (ముంబై), 11న వన్డే వార్మప్ మ్యాచ్ (ముంబై), 14న తొలి వన్డే (రాజ్‌కోట్), 17న రెండో వన్డే (ఇండోర్), 20న మూడో వన్డే (కాన్పూర్), 23న నాలుగో వన్డే (జెంషెడ్‌పూర్), 26న ఐదో వన్డే (కటక్), 29న ఆరో వన్డే (గౌహతి), డిసెంబర్ 2న ఏడో వన్డే (ఢిల్లీ), డిసెంబర్ 5-7న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ (బరోడా), 11-15న తొలి టెస్ట్ (అహ్మదాబాద్), 19-23న రెండోటెస్ట్ (ముంబై).
|