క్రికెట్‌లో ఆటగాళ్లు క్రమశిక్షణతో మెలిగేలా చేయడానికి పాకిస్థాన్ సరికొత్త దారులను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఇకనుంచి టోర్నీలకు ముందు ఆటగాళ్లకు సైనిక శిక్షణ ఇప్పించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ నిర్ణయించింది.
ఈ విషయమై పీసీబీ మేనేజర్ తలత్ అలీ మాట్లాడుతూ త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న జట్టుకు ప్రస్తుతం సైనిక శిక్షణ కొనసాగుతోందని తెలిపారు. వారం రోజులపాటు కొనసాగే ఈ శిక్షణా కార్యక్రమంలో ఆటగాళ్లకు అన్ని తరహాలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇందుకోసం జట్టు ట్రైయినర్ పర్యవేక్షణలో ఈ సైనిక శిక్షణ అందిస్తున్నామని ఆయన వివరించారు. ఆటగాళ్లలో మరింత క్రమశిక్షణ తీసుకురావడం కోసమే తామీ రకమైన చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో సైతం పాక్ క్రికెట్ బోర్డ్ తమ ఆటగాళ్లకు ఇలాంటి సైనిక శిక్షణ అందించిందని ఆయన తెలిపారు.
|