తన నాయకత్వం గురించి పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాడైన అఫ్రిది తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ లక్ష్మణ్ ఈ సందర్భంగా ప్రశ్నించాడు.
ఈ విషయమై లక్ష్మణ్ మాట్లాడుతూ ఐపీఎల్ సందర్భంగా డెక్కన్ ఛార్జర్స్ జట్టు విఫలం కావడానికి తానొక్కడినే కారణం కాదని అన్నాడు. జట్టులోని అందరు ఆటగాళ్లు తమ పరిధి మేరకు రాణించలేకపోయారని అందుకే జట్టు ఓటముల సంఖ్య ఎక్కువగా ఉందని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
అందుకే డెక్కన్ ఛార్జర్ ఓటమి అనేది సమిష్టి ఓటమి అని లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. అలాంటి సందర్భంలో డెక్కన్ చార్జర్స్ ఓటమికి కేవలం కెప్టెన్ అయిన తననే బాధ్యున్ని చేయడం సమంజసం కాదని లక్ష్మణ్ పేర్కొన్నాడు. లక్ష్మణ్ నాయకత్వంపై అఫ్రిది చేసిన వ్యాఖ్యలను పలువురి నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
లక్ష్మణ్ లాంటి సీనియర్ ఆటగాడి విషయంలో అఫ్రిది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని వారు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ టోర్నీలో హైదరాబాద్ జట్టు డెక్కన్ ఛార్జర్స్‌కు లక్ష్మణ్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జట్టులో సభ్యుడైన పాక్ ఆల్‌రౌండర్ అఫ్రిది మాట్లాడుతూ డెక్కన్ ఛార్జర్స్‌కు లక్ష్మణ్ నాయకత్వం బాగోలేదని అతని కంటే గిల్‌క్రిస్ట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం మంచిదని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
|